హైదరాబాద్ (మెట్రో న్యూస్):
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పటం ద్వారా తెలంగాణ నీటి ప్రయోజనాలను రేవంత్ సర్కార్ ఏపీకి తాకట్టు పెడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో తెలంగాణకు దక్కాల్సిన 250 టీఎంసీల నీళ్ల వాటాను తన గురువు చంద్రబాబుకు గురుదక్షణగా రేవంత్ రెడ్డి సమర్పించుకుంటున్నాడని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించటం వారి ద్వంద్వ విధానాలను తెలియజేస్తోందంటూ బుధవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని కూడా ఆ సమావేశాల్లో అధికారులు కోరారని కవిత చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుగుణంగా నదుల అనుసంధానం జరిగేలా రేవంత్ సహకరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఆమోదంతోనే ఏపీ ప్రభుత్వం పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును నదుల అనుసంధానంలో భాగంగా చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తోందని కవిత చెప్పారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి మనకు జరిగే నష్టాన్ని గుర్తుంచాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ పై కేంద్రం చేపట్టిన అన్ని సంప్రదింపుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రికి లేఖ రాయాలని కోరారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు.