హైదరాబాద్ (మెట్రో న్యూస్):
విశ్వకర్మ కమ్యూనిటీ జేఏసీ
కన్వీనర్ డి. కాళిదాస్ హర్షం
విశ్వబ్రాహ్మణ కుల సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు విశ్వకర్మ కమ్యూనిటీ జేఏసీ కన్వీనర్, పారిశ్రామికవేత్త దేవరకొండ కాళిదాస్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణ కులానికి ప్రభుత్వం మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని ఉప్పల్ భగాయత్‌లో 5 ఎకరాల స్థలం కేటాయించిందని, ఈ నిధులతో విశ్వకర్మ సమాజం ఆశించిన విధంగా స్మిల్ డెవలప్మెంట్, వసతి సౌకర్యం, కుల సంఘాల సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా భవన నిర్మాణం, నిర్వహణ ఉండాలని సూచన చేశారు. భవన నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు, హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషనర్ బాలమాయాదేవికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. పాలనాపరమైన అనుమతులు, నిధుల మంజూరుతో పంచదాయిల ఆకాంక్షల మేరకు ఆత్మగౌరవ భవనం వీలైనంత త్వరగా అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆత్మగౌరవ భవనం సంక్షేమ ట్రస్టు సభ్యులకు ఈ సందర్భంగా కాళిదాస్ అభినందనలు తెలిపారు.