హైదరాబాద్ (మెట్రో న్యూస్):
- 3 గంటలకు మంత్రులతో సీఎం అనధికార సమావేశం
- 4 గంటలకు సమావేశం కానున్న మంత్రివర్గం
తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపట్లో జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రిమండలి సమావేశం ప్రారంభమవుతుంది. దానికి ముందు 3 గంటలకు మంత్రులతో సీఎం అనధికారికంగా ఓ గంటసేపు సమావేశం కానున్నారు. కేబినెట్ ఎజెండా, ఇతర ముఖ్యాంశాలపై మంత్రులతో మాట్లాడనున్నారు. ఇక కేబినెట్‌లో ప్రధానంగా కరవు, ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ చర్యలు, మంచినీటి సరఫరా, రాష్ట్రంలోని జలాశయాలలో నీటి నిల్వలు, ఉపాధి హామీ అమలు, విద్యుత్ డిమాండు, కేంద్రం కరవు ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే వచ్చేనెలలో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, ప్రచారం, నిర్వహణపై ప్రత్యేకంగా చర్చిస్తారని సమాచారం. స్మార్ట్ రేషన్ కార్డులపై ఇప్పటికే సన్నబియ్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వం, నిత్యావసర సరుకులను కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై కేబినెట్‌లో చర్చించనున్నారు.