(మెట్రో న్యూస్):
ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ నెల 15.10.2026 (గురువారం), 16.10.2026 (శుక్రవారం) ప్రత్యేక శిబిరాలు కొనసాగుతుండగా, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాల నంబర్ 278, 279లో ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం పరిశీలించారు. ఫారం-6 ద్వారా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో ఆరా తీయగా, మొత్తం 12 దరఖాస్తులు వచ్చినట్లు బూత్ లెవల్ అధికారి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా నూతన ఓటర్ నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 16.10.2026 (శుక్రవారం) ప్రత్యేక శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. మొదటిసారి ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే యువత తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ‘ఫారం-6’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పైన పేర్కొన్న రోజుల్లో సంబంధిత బీ ఎల్ ఓ లు బీ ఎల్ ఏ లు ఆయా నిర్దేశిత కేంద్రాలలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని పేర్కొన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటు హక్కు పునాది వంటిదన్నారు. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్ బాబు, ఇంచార్జి తహసీల్దార్ మురళి, సర్పంచ్ చిలువేరి లావణ్య తదితరులు పాల్గొన్నారు.