హైదరాబాద్ (మెట్రో న్యూస్):
యాదవుల ఆత్మగౌరవానికి లోటు రానివ్వం
సదర్ సమ్మేళన కార్యక్రమంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
యాదవ సోదరులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదర్ సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది యాదవులకే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి ఆత్మగౌరవ సమ్మేళనం అన్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటి గోల్కొండ కోట ఒకనాటి గొల్లంకొండ అని గుర్తుచేస్తూ… యాదవ సోదరుల సహకారంతోనే హైదరాబాద్ నగరం ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారిని యాదవ సోదరులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వద్ద శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సదర్ సమ్మేళన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యాదవులు కొరగానే సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాం.. సదర్ సమ్మేళనం నిర్వహణకు రూ.5 కోట్లు మంజూరు చేశాం… తమ ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం కల్పించాం… అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాం అని పేర్కొన్నారు. ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించాం అని చెప్పారు. యాదగిరి గుట్ట గోశాలలో గోసంరక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో యాదవులకు దక్కాల్సిన వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు లేకుండా చూసే బాధ్యత తీసుకుంటామన్నారు. మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని, ఇందుకు యాదవ సోదరుల సహకారం ఉండాలని కోరారు.