Take a fresh look at your lifestyle.

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం..

0 10

(మెట్రో న్యూస్):

– ఎస్పీ మహేష్ బి. గితే
– విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ

శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సాయుధ పోలీసులు శోక శస్త్ర నిర్వహించగా, గత ఏడాది నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసుల పేర్లను చదివి వినిపించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. జిల్లాలో అంతర్గత భద్రత విధుల్లో ఎనిమిది మందికి పైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల ఫలితంగానే ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు తెలిపిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి జ్ఞాపికలను అందజేశారు. పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ, రన్, ఓపెన్ హౌస్, వ్యాసరచన, ఫొటో, వీడియో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.