Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. శనివారమయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు. నిన్నటి వరకూ భక్తుల క్యూ లైన్ బయట వరకూ కొనసాగింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతుంది. సహజంగా శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది నిన్న మొన్నటితో పోల్చుకుంటే నేడు భక్తుల రద్దీ అంతగా లేదనే చెప్పాలి. కేవలం కంపార్ట్ మెంట్ల వరకే భక్తులు ఉన్నారు. సామాన్య భక్తులకు కూడా దర్శనం సులువుగానే లభిస్తుందని, అయితే మధ్యాహ్నానికి భక్తుల రద్దీ పెరగవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ... ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో అంకురార్పణ జరగనుంది. దీంతో నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వచ్చే నెలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబరు నెలలో వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరగనున్నాయి. అందుకే రానున్న రెండు నెలల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది. అలాగే డిసెంబరు నెల సంవత్సరం ఆఖరి నెల కావడంతో భక్తుల రద్దీ ఎక్కువ గా ఉంటుంది. అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినం పూర్తయిన పది రోజుల వరకూ భక్తుల రద్దీ ఉంటుందన్న అంచనాలు మాత్రం టీటీడీ వేసి అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసి పనులు చేపట్టింది.
31 కంపార్ట్ మెంట్లలోనే ... ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శీఘ్రదర్శనం టోకెన్లున్న భక్తులకు మూడు గంటల దర్శన సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,057 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,406 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చింది. నిన్న శ్రీవారి లడ్డూ విక్రయాలు 4.62 లక్షల మేరకు జరిగాయని అధికారులు తెలిపారు. నిన్న స్వామి వారి అన్న ప్రసాదాన్ని 2.40 లక్షల మంది స్వీకరించారు.