ప్రజావాణి అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రజావాణిలో (221) దరఖాస్తుల స్వీకరణ
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామప్రతినిధి మెట్రో న్యూస్ నవంబర్ 2
జిల్లాలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనుఇవ్వాలన్నారు. అదే విధంగా పెండింగ్ లో గల ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణిలో మొత్తం (221) దరఖాస్తులను *కలెక్టర్ స్వీకరించారు.
ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి..
రఘునాథపల్లి మండలం, నిడిగొండ గ్రామానికి చెందిన మల్ రెడ్డి నారాయణమ్మ, తనకు ఒక ఎకరం నాలుగు గుంటల భూమి ఉందని, టీఓబీలో ఆగి ఉందని, తమ వారసుల పేరు మీదకు విరాసత్ ఎక్కేటట్లు చేయగలరని విజ్ఞప్తి చేస్తూ అర్జీని సమర్పించారు. ఘనపూర్ (స్టేషన్) మండలం, ఇప్పగూడెం గ్రామానికి చెందిన కరాజుల ధర్మారెడ్డి, అక్రమంగా కొందరు తన భూమి ఆర్ఓఆర్ పట్టా చేసుకున్నారని, ఆ అక్రమ పట్టాలను రద్దు చేసి, రికార్డులో తమ పేరుకు సరిచేసి, పాస్ పుస్తకం ఇప్పించగలరని మనవి చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు.జఫర్గడ్ మండలం, కూనూరు గ్రామానికి చెందిన రైతులు ఆకేరు చెక్ డ్యాం నుంచి పక్క గ్రామానికి చెందిన కొంత మంది అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేసి, పైపులైన్ల ద్వారా నీటిని తరలించుకుంటూ ప్రజా నీటిని దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమ మోటార్లు, పైపులైన్లు తొలగించి, ప్రజా వనరును పరిరక్షించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విన్నవిస్తూ దరఖాస్తునుసమర్పించారు. పాలకుర్తి మండలం, వావిలాల గ్రామానికి చెందిన పేరం మహేందర్, తమ ఇంటి స్థలం ప్రహారీ గోడకు ఆనుకొని పెద్ద చింత చెట్టు కలదని, చెట్టు కొమ్మలు మొత్తం ఇంటి స్థలంలోకి వంగి ఉందని, దీని వల్ల కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఈ మేరకు చెట్టు కొమ్మలు తొలగించి తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తును సమర్పించనైనది.
జనగామ మండలం, శాతాపురం గ్రామానికి చెందిన పిట్టల వెంకటేష్, తన ఒక ఎకరం 22 గుంటల భూమికి 2012 వరకు పహాణి వచ్చిందని, ఇప్పుడు రావడం లేదని, పహాణి తిరిగి నమోదు చేయగలరని కోరుతూ దరఖాస్తునుసమర్పించారు. ఈ ప్రజావాణిలో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చినకోట్యా నాయక్, ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.