Take a fresh look at your lifestyle.

ఎల్ నిలో పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి..

0 5

(మెట్రో న్యూస్) :

రాష్ట్రానికి రెండు సంవత్సరాలకు సరిపడా భండాగారం..
నీటిని ఒడిసి పట్టి, విద్యుత్ నియంత్రణ చేయాలి..
మంత్రి పొన్నం ప్రభాకర్..

ఎల్ నిలో పరిస్థితులు ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలనీ, నీటిని వృధా చేయకుండా ఒడిసి పట్టి, విద్యుత్ నియంత్రణ చేయాలని స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర రవాణా మరియు బీసీ శాఖ అమాత్యులు పొన్నంప్రభాకర్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వరి మరియు పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్ ని నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా,రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు కురవాలని పాడిపంటలు పండాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో మహాచండీయాగంలో అమ్మవారిని కోరుకున్నామని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 136 వరి,పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, నేటి నుంచి ఆయా కేంద్రాలు కొనుగోలు ప్రారంభం అవుతావని అన్నారు. Msp ధర A గ్రేడ్ సన్నధాన్యం కి 2461/- గాను బి గ్రేడ్ కి 2441/- ఉందనీ, కల్లాల్లోనే అంతకన్నా ఎక్కువ ధర పెట్టీ కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఈసారి వరి తక్కువగా వేయడం వల్ల ధాన్యానికి డిమాండ్ అధికంగా ఉందనీ, పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి దళారులు కల్లాల్లోకి వస్తున్నారు కావున మోసపోవద్దనీ, మద్దతు ధర కన్నా అధికంగా రేటు ఇచ్చి కొనుగోలు చేస్తే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. రైతులు తాము పండించిన పంటకు మద్దతు ధరకు కన్నా తక్కువగా అమ్ముకోవద్దనీ, సన్న వడ్లకి బోనస్ మీ ఖాతాల్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.కొనుగోళ్ళులో, తూకంలో ఇబ్బందులు రావద్దనీ, ధాన్యం,పత్తి ఎంత వచ్చిన కొనుగోలు చేస్తామని అన్నారు. రాబోయే కాలంలో రైతులే స్వచ్ఛందంగా వరికి దూరం ఉండే అవకాశం ఉంటుందనీ, ఇప్పటికే ప్రభుత్వం నుండి వచ్చే సీజన్ లో వరిసాగు చేస్తే నీళ్లు ,విద్యుత్ ఇబ్బందులు ఎదురవుతాయని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేబినెట్ లో రాష్ట్రానికి రెండు సంవత్సరాలకు సరిపడ భండాగారం ఉందని అన్నారు. రాష్ట్రంలో 300 కి పైగా కరువు మండలాలు ఉన్నాయనీ, రానున్న రోజుల్లో ఎల్ నినో తీవ్రత పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కావున తాగునీరుకి కూడా ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఇప్పట్నుంచే నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనీ అన్నారు.ఈనెల28 వ తేదీ అన్ని రాజకీయ పార్టీల తో ఎల్ నినో ఎదుర్కోవడానికి సమావేశం నిర్వహిస్తున్నామని అనంతరం హుస్నాబాద్ లో కూడా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎల్ నినో ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంశాలపై చర్చించుకుందామని అన్నారు. 28 అఖిలపక్ష సమావేశం తర్వాత అఖిలపక్ష పార్టీలను తీసుకుపోయి ఢిల్లీ వెళ్లి మనకు కావాల్సినవి ఢిల్లీ వెళ్లి అడుగుతామని, ఎల్ నినో ప్రభావం ప్రపంచ దేశాల్లో ఉందనీ, దీనిపై రాజకీయ విమర్శలు చేసుకోవడం మానుకోవాలనీ అన్నారు. 2007 లో ప్రారంభించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువలకు భూసేకరణ వేగంగా జరుగుతుందనీ, భూములు కోల్పోయన వారి త్యాగాలు గుర్తిస్తామని, భూములు త్యాగాలు చేస్తేనే వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందనీ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు గ్రామాల వారిగా సమీక్ష చేసుకోవాలని, 10 ఏళ్లలో ఎన్ని ఇళ్లు వచ్చాయో, ఇప్పుడు ఎన్ని వచ్చాయో చర్చ జరగాలని అన్నారు. నియోజకవర్గంలో మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇళ్లు, రెండవ దశలో 2000 ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయనీ, గుడిసెల్లో ఉన్న వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. చిగురుమామిడి,సుoదరగిరి రోడ్లు, అభివృద్ధిలో ఇల్లు కోల్పోయిన వారికి, హుస్నాబాద్- అక్కన్నపేట, మల్లెచెట్టు చౌరస్తా నుండి ఇల్లు కోల్పోయిన వారికి, చౌటపల్లి పారిశ్రామిక కారిడార్ లో భూములు కోల్పోయి అర్హత ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండిలక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతిరెడ్డి, సుధాకర్, ఆర్డీవో రామ్మూర్తి, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.