Take a fresh look at your lifestyle.

నిజాయితీనే విజయానికి బాట.. అవినీతికి చరమగీతం!

0 7

(మెట్రో న్యూస్)

మందమర్రి ఏరియాలో విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు ప్రారంభం

ఇన్‌చార్జి జీఎం జి.ఎల్‌. ప్రసాద్‌ పిలుపు.. అధికారులతో సత్యనిష్ఠ ప్రతిజ్ఞ

సంస్థ అభివృద్ధికి నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం కీలకమని మందమర్రి ఏరియా ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ జి.ఎల్‌. ప్రసాద్‌ అన్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రతి ఉద్యోగి నైతిక విలువలతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలో సోమవారం విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జి.ఎల్‌. ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు అక్టోబరు 26 నుంచి నవంబరు 1వ తేదీ వరకు ఏరియాలోని అన్ని గనులు, విభాగాలు, కార్యాలయాల్లో వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ‘నిజాయితీతో సమృద్ధి’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. స్వతంత్ర భారత తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఏటా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు.

సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే ప్రణాళికల అమలులో పారదర్శకత అవసరమని జి.ఎల్‌. ప్రసాద్‌ పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, అవకతవకలు, అధికార దుర్వినియోగం చోటుచేసుకుంటే సంస్థ పురోగతికి విఘాతం కలుగుతుందని అన్నారు. అవినీతి ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా సంస్థ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని వివరించారు.

ప్రతి అధికారి, ఉద్యోగి విధి నిర్వహణలో నిజాయితీని పాటిస్తూ జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. సింగరేణిలో అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్‌ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని, ఉద్యోగుల్లో నిరంతరం అవగాహన కల్పిస్తోందని ప్రశంసించారు. సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ నిజాయితీని జీవన విధానంగా మార్చుకోవాలని కోరారు.

అనంతరం అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి పౌరుల సత్యనిష్ఠ ప్రతిజ్ఞ చేశారు. విధి నిర్వహణలో నైతిక విలువలను పాటిస్తూ అవినీతికి దూరంగా ఉంటామని ప్రతినబూనారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ శాఖ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేష్‌, సీఎంఓఏఐ సంయుక్త కార్యదర్శి రవి, డీజీఎం (పర్సనల్‌) సీహెచ్‌. అశోక్‌, సమాచార విభాగం, సేవా సమన్వయ అధికారి, సీనియర్‌ పీవో సత్యనారాయణ, జీఎం కార్యాలయ ఫిట్‌ కార్యదర్శి గీతిక, జీఎం కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.