Take a fresh look at your lifestyle.

వీసా ఇంటర్వ్యూలు రద్దు.. ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం.. అసలేం జరుగుతోంది?

0 16
Trump government cancels visa interviews what is happening
  • ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్‌
  • ఇప్పటికే ఖరారైన అపాయింట్‌మెంట్ల రీషెడ్యూల్‌
  • కాన్సులర్‌ అధికారుల ప్రత్యేక శిక్షణ కోసమే నిర్ణయం 
  • వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కఠినతరం
  • మార్పులు ఎంతకాలం కొనసాగుతాయో లేని స్పష్టత

అమెరికా వీసా కోసం ఇంటర్వ్యూకు సిద్ధమైన వారికి ట్రంప్‌ ప్రభుత్వం షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో వీసా సేవల అపాయింట్‌మెంట్లను నిలిపివేయడం లేదా వాయిదా వేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఖరారైన ఇంటర్వ్యూలను కూడా రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు సమాచారం.

ఎందుకీ నిర్ణయం?
విదేశాల్లోని అన్ని దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న కాన్సులర్‌ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్నవారిని గుర్తించడంతోపాటు వీసా దరఖాస్తుదారుల పరిశీలనను మరింత సమగ్రంగా, ఒకే విధానంలో నిర్వహించడమే లక్ష్యమని వెల్లడించింది. అయితే ఈ మార్పులు ఎంతకాలం కొనసాగుతాయనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

ఇంటర్వ్యూల రీషెడ్యూల్‌
ఇప్పటికే వీసా ఇంటర్వ్యూ తేదీలు ఖరారైన పలువురు దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్లు మారినట్లు ఈ-మెయిల్స్‌ వెళ్లినట్లు ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ వెల్లడించింది. కొత్త తేదీని తర్వాత తెలియజేస్తామని అందులో పేర్కొన్నట్లు సమాచారం.

వలసలపై మరింత కఠినంగా..
రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వీసాలు, గ్రీన్‌కార్డుల రద్దు, వివిధ కారణాలతో దరఖాస్తుల తిరస్కరణ వంటి చర్యలను వేగవంతం చేశారు. తాజాగా హెచ్‌-1బీ వీసా విధానంలోనూ భారీ మార్పులకు అమెరికా ప్రభుత్వం ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఇది వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

2 లక్షల వీసాల రద్దు యోచన
పర్యాటక, వ్యాపార వీసాలతో అమెరికాకు వెళ్లి తర్వాత ఆశ్రయం కోరుతూ అక్కడే ఉండేందుకు ప్రయత్నించిన దాదాపు రెండు లక్షల మంది విదేశీయుల వీసాలను రద్దు చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. దేశీయ భద్రత కోసమే ఈ కఠిన చర్యలని ట్రంప్‌ చెబుతున్నారు. అయితే ట్రంప్‌ వలస విధానాలపై మానవ హక్కుల సంస్థలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చట్టబద్ధ వలసలకూ కొత్త అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.