Take a fresh look at your lifestyle.

రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించాలి

0 5

(మెట్రో న్యూస్)

మండల వ్యవసాయ అధికారి సారిక

భారత ప్రభుత్వం చేపట్టిన‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని రైతు వేదికలో భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం,భూసంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను,భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను గుర్తించి,సిఫారసు చేసిన మోతాదులో సమతుల్యంగా ఎరువులు వినియోగించాల్సిన ఆవశ్యకతను వివరించారు.అవసరానికి మించి ఎరువులు వినియోగించడం వల్ల సాగు ఖర్చులు పెరిగే అవకాశం ఉందని,భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడటం ద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట దిగుబడిని మెరుగుపరచుకోవచ్చని తెలిపారు.నేల కోతను నివారించడం,భూసారాన్ని కాపాడుకోవడం,సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం,దీర్ఘకాలికంగా భూమి సారవంతంగా ఉండేలా తగిన భూసంరక్షణ చర్యలు చేపట్టడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈసందర్భంగా మండల వ్యవసాయ అధికారి సారిక మాట్లాడుతూ…రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని,వాటి ఫలితాల ఆధారంగా వ్యవసాయ శాఖ సూచించిన ఎరువులను సరైన మోతాదులో వినియోగించాలని సూచించారు.భూసార పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ,సుస్థిర వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకొని,వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సారిక,కేవికే ఎస్ఎంఎస్ రమేష్,పీఏసీఎస్ చైర్మన్లు హనుమంత్,నాగిశెట్టి పాటిల్,ఆత్మ డైరెక్టర్లు,వ్యవసాయ విస్తరణ అధికారి నిఖిలేష్,పంచాయతీ కార్యదర్శులు,గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్,గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.