Take a fresh look at your lifestyle.

ఎల్ నినో ముప్పు…..

0 8

పసిఫిక్ సగటు వేడి..

రైతుకు గుండెకోత!

ప్రపంచాన్ని భయపెడుతున్న వాతావరణ మార్పులు

నైరుతిపై ప్రతికూల ప్రభావం.. తీవ్ర ముప్పులో వ్యవసాయ రంగం

ప్రభుత్వాలు, రైతాంగం తక్షణమే మేల్కొనాల్సిందే!

విశ్వ మానవాళిని, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న పేరు.. ‘ఎల్ నినో’! పసిఫిక్ మహాసముద్రపు ఉపరితలంలో సంభవిస్తున్న అసాధారణ ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రపంచ వాతావరణ వ్యవస్థల సమతుల్యతను తలకిందులు చేస్తోంది. సాధారణంగా పసిఫిక్‌లో గాలులు పశ్చిమ దిశగా వీచి, ఆసియా భూభాగంలో సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి. కానీ, ఎల్ నినో సమయంలో ఈ గాలులు బలహీనపడి విపరీతమైన వేడి నీరు తూర్పు పసిఫిక్ వైపు మళ్లుతుంది. దీని ప్రభావంతో ఒకవైపు కరువు కాటకాలు, మరోవైపు అకాల వరదలు ముంచెత్తుతున్నాయి. భారతదేశం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై దీని నీడ స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు బలహీనపడి, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది
ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గడం, నీటి నిల్వలు అడుగంటిపోవడం మొదటగా దెబ్బతీసేది రైతాంగాన్నే.వరి, చెరకు సాగుకు గండి ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, చెరకు వంటి ప్రధాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతుంది. నాట్లు ఆలస్యమవ్వడం లేదా నాట్లు వేసినా నీ అందక ఎండిపోవడం వంటి తీవ్ర నష్టాలు ఎదురవుతాయి.
ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతే దేశంలో ఆహార లభ్యత తగ్గి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదముంది.పచ్చగడ్డి లభించక పశుసంపద క్షీణించి, పాల ఉత్పత్తి దెబ్బతింటుంది.
సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకే పరిమితమైతే ఈ కాలంలో తీవ్ర నష్టాలు తప్పవు. రైతులు వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి.నీటి అవసరం ఎక్కువగా ఉండే వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు జొన్నలు, సజ్జలు, రాగులు పెసర, మినుము, కంది, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలి. సంప్రదాయ కాలువల ద్వారా కాకుండా డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను ఉపయోగించి లభ్యతలో ఉన్న ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వాడుకోవాలి.
తక్కువ రోజుల్లో 90 నుంచి 110 రోజుల్లో దిగుబడినిచ్చే పంట రకాలను ఎంచుకోవడం ద్వారా కరువు ముప్పు నుండి తప్పుకోవచ్చు.
పొలాల్లో ఆకులు, చెత్తతో మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవాలి. పంట కుంటలు తవ్వుకుని వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలి.

ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలతో సిద్ధంగా ఉండాలి.
వాతావరణ హెచ్చరికలను జిల్లా, మండల, గ్రామ స్థాయికి త్వరితగతిన చేరవేసి, ఆయా ప్రాంతాల నీటి లభ్యతను బట్టి కంటింజెన్సీ అత్యవసర ప్రణాళికలు అమలు చేయాలి.ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతులకు రాయితీపై అందుబాటులో ఉంచాలి. బిందు సేద్య పరికరాలకు గరిష్ట సబ్సిడీలు ప్రకటించాలి.
సాగు, తాగునీటి ప్రాజెక్టులలో నీటి మట్టాలను ముందస్తుగా సమీక్షించి, తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ నీటి కేటాయింపులు చేయాలి. నష్టపోయిన రైతాంగానికి తక్షణమే పంట బీమా పరిపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి చెరువుల్లో పూడిక తీత, కంటూర్ బండ్లు, నీటి సంరక్షణ నిర్మాణాలను వేగవంతం చేయాలి.
ప్రభుత్వాలు, రైతులు మాత్రమే కాదు.. సాధారణ ప్రజలు కూడా ఈ సవాలును ఎదుర్కోవడంలో భాగస్వాములు కావాలి. గృహ అవసరాల్లో నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలి. నగరాలు, పట్టణాల్లో ప్రతీ ఇంట్లో వర్షపు నీటి ఇంకుడు గుంతలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి,నిత్య జీవితంలో చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రైతులకు ఆరుతడి పంటలపై ఆసక్తి పెరిగి, నీటి వినియోగం తగ్గుతుంది. పర్యావరణ సమతుల్యత కోసం విస్తృతంగా మొక్కలు నాటడం, అడవులను కాపాడుకోవడం సుదీర్ఘకాలంలో వాతావరణ మార్పులను అరికట్టడానికి దోహదపడతాయి.ఎల్ నినో’ అనేది ప్రకృతి మనకు ఇస్తున్న స్పష్టమైన హెచ్చరిక. ముందే గుర్తించి యంత్రాంగం అప్రమత్తమైతేనే భారీ నష్టాల నుండి సమాజాన్ని కాపాడుకోగలం. అలసత్వం వహిస్తే మాత్రం భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి, ఆహార సంక్షోభం తలుపు తట్టడం ఖాయం. ఉమ్మడి కార్యాచరణతోనే ఈ ‘పసిఫిక్ సెగ’ను తట్టుకోవడం సాధ్యమౌతుంది. రానున్న ముప్పును ఎదుర్కొనే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు అధికారులను మరో ప్రజలను రైతులను ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేనులను భాగస్వామ్యం చేస్తున్న నేపథ్యంలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు సహకరిస్తే ఉప్పును ఎదుర్కోవడం ఎంత మాత్రం కష్టం కాదు రెండు చేతులు కలిస్తే చప్పట్లు అన్న చందంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎల్ నినో విషయంలో చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు సైతం చేదోడు వాదోడుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

ఉప్పల శ్రీనివాస్ గుప్తా
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

Leave A Reply

Your email address will not be published.