(మెట్రో న్యూస్):
సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వారి సమస్యలను పరిష్కరించేందుకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు చేస్తున్న కృషిలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2026 వర్షాకాల శాసనసభ సమావేశాల్లో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే జీఎస్సార్ శాసనసభ దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సింగరేణి ప్రాంతానికి చెందిన శాసనసభ్యులతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా, శాసనసభలో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కృషి చేశారు. కేటీకే-1, 8 ఇంక్లైన్ గేట్ మీటింగ్‌ల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల హక్కులు, వారి కుటుంబాల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించేలా కృషి చేశారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటా కింద మొత్తం రూ.1,754 కోట్ల పంపిణీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. దీనివల్ల ఒక్కో కార్మికుడికి సగటున సుమారు రూ.1.54 లక్షలు అందే అవకాశం ఉంది. దసరా సందర్భంగా కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 ప్రత్యేక ఆర్థిక ప్రయోజనం కల్పించే అంశాన్ని ప్రకటించారు. ప్రతి కార్మిక కుటుంబానికి ఇంటి స్థలం కల్పించాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలనే అంశం సమావేశంలో ప్రాధాన్యత పొందింది. అధికారులకు అందుతున్న పెర్క్విజిట్స్ పన్ను మినహాయింపు సౌకర్యాన్ని కార్మికులకు కూడా వర్తింపజేసే అంశంపై నిర్ణయం తీసుకున్నారు.
ఏళ్ల తరబడి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న మారుపేర్ల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించబడిన కార్మికులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానం ద్వారా తిరిగి ఉద్యోగంలోకి వచ్చే అవకాశం కల్పించే అంశంపై చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేసి, 15 రోజుల్లో నియామక పత్రాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మెడికల్ ఇన్‌వాలిడేషన్ ప్రక్రియ కోసం కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిని నివారించేందుకు ఏరియా ఆసుపత్రుల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు.
అదేవిధంగా ఏరియా ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాయికి అభివృద్ధి చేయాలనే అంశంపై దృష్టి సారించారు. సింగరేణి కార్మికులు తమ శ్రమతో సంస్థ అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్నారని, వారి కుటుంబాల సంక్షేమం, ఉద్యోగ భద్రత, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం ముఖ్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలుమార్లు పేర్కొన్నారు.