Take a fresh look at your lifestyle.

ఊరు వాడా ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌ర‌చాలి

0 7

హైదరాబాద్ (మెట్రో న్యూస్‌):

  • ఎల్‌నినోపై స‌మాచార శాఖ
    ద్వారా విస్తృత ప్ర‌చారం
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

ఎల్‌నినో ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై చూపే ప్రభావం, వాటి వల్ల తలెత్తే పరిణామాలపై ప్రజలను చైతన్య పర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై ఎల్-నినో చూపే ప్రభావాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తు జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సమాచార శాఖ అధికారులు, సాంస్కృతిక సారథి కళాకారులకు నిర్వహించిన ఒకరోజు చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రజలకు సమయానుకూలంగా సరైన సమాచారం అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

సమాచార, పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక శాఖ సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రజా అవగాహన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణానికి ఈ ప్రచారాన్ని విస్తరించి, ప్రజలందరికీ ఎల్‌నినో ప్రభావాలు, వాటిని ఎదుర్కొనే ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని ఆయ‌న తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సహకారంతో జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర ప్రజా అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ సందేశాలను ప్రజలకు చేరవేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా పౌరసంబంధాల అధికారులు (డీపీఆర్వోలు), తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొని, క్షేత్రస్థాయిలో ప్రజలకు చైతన్యం, అవగాహన కల్పించాలని సీఎస్ అన్నారు.

ఈ కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ జి. ముకుంద రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఎ. నరసింహ రెడ్డి, సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్, సంయుక్త సంచాలకులు కె.వెంకట రమణ, శ్రీనివాస్, మధు సూధన్‌తో పాటు వ్యవసాయ, విద్యుత్, పశుసంవర్ధక శాఖల అధికారులు, రాష్ట్రం లోని అన్ని జిల్లాల పౌర సంబంధాల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.