Take a fresh look at your lifestyle.

తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి…

0 20

మెట్రో న్యూస్:

  • ఎల్‌నినో పరిస్థితులను
    ఎదుర్కొనేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకం…
  • రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్…

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు.తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి వృథాను అరికట్టడంతో పాటు అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియో
గించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ఎల్‌నినో పరిస్థితులను సమర్థ
వంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో పాటు ప్రజలు, రైతుల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.శుక్రవారం గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో అదనపు కలెక్టర్ టి.ఎల్. సంగీతతో కలిసి వాణి ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామంలో సాగవుతున్న పత్తి, కంది, టమాట పంటలను పరిశీలించి, పత్తి సాగు చేస్తున్న రైతు బాల్‌రెడ్డితో మాట్లాడి పంటల పరిస్థితి, నీటి లభ్యత, సాగు వివరాలను తెలుసు
కున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. ప్రతి రైతు పొలంలో ఫామ్ పాండ్స్ నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు తెలిపారు.
వీబీ-జీ రామ్‌జీ పథకం కింద పనిదినాలను సద్వినియోగం చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని, అవసరమైన చోట పంట విరామం పాటించేలా రైతులను ప్రోత్సహించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రానున్న రోజుల్లో ఎదురయ్యే నీటి సమస్యలపై ప్రజలకు వాస్తవిక పరిస్థితులను వివరించాలని తెలిపారు.అనంతరం గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో వాణి ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పంటల పరిస్థితి, వర్షపాతం, తాగునీటి వనరులు, విద్యుత్ సరఫరా, పశుగ్రాసం లభ్యత, భవిష్యత్తులో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు రూపొందించాల్సిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలు చేతికొచ్చే వరకు వాటిని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాబోయే యాసంగి సీజన్‌లో నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రైతులు ఆరుతడి పంటలు ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. నీటి లభ్యతను అంచనా వేయకుండా వరి సాగు చేసి రైతులు నష్టపోకుండా
చూడాలని సూచించారు.వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలవారీగా పంటల పరిస్థితిని పరిశీలించి, పంటల రక్షణకు రైతులకు తగిన సూచనలు అందించాలన్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల స్థాయి, బోర్లలో నీటి లభ్యత, విద్యుత్ సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులకు మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.గ్రామాలవారీగా తాగునీటి అవసరాలు, నీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని వాణి ప్రసాద్ సూచించారు. వ్యవసాయ, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నీటి సరఫరాలో వృథాను అరికట్టి, నీటిని పొదుపుగా వినియోగించుకునేలా వాటర్ రిసోర్సెస్ కమిటీలకు అవగాహన కల్పించాలని, గ్రామస్థాయిలో నీటి సంరక్షణకు సంబంధించిన తీర్మానాలు చేయించాలని తెలిపారు.రాబోయే 10–15 రోజులు పంటల రక్షణకు కీలకమని పేర్కొంటూ, అవసరమైన ప్రాంతాల్లో పంటలకు తగిన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రతి వారం సంయుక్త సమీక్ష సమావేశం నిర్వహించాలని తెలిపారు.ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పశుగ్రాసానికి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా పశుగ్రాసాన్ని నిల్వ చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పశుగ్రాసం వృథా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల అదనపు కలెక్టర్లు సంగీత, లక్ష్మి కిరణ్, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు, సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి, గుమ్మడిదల తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.