కేటీఆర్ డిలిమిటేషన్ ప్రకటన:
నియోజకవర్గాల పునర్విభజన పై కేటీఆర్ ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది ఎంపీ సీట్ల నిష్పత్తి మారకుండా డిలిమిటేషన్ చేస్తే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించారు.
డిలిమిటేషన్ బిల్లు:
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వేదికగా చేసిన ప్రకటనలు రాష్ట్ర , జాతీయ రాజకీయాల్లో ర్చనీయాంశమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నిష్పత్తి ప్రకారం సీట్ల సంఖ్యను పెంచితే డిలిమిటేషన్‌కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని కేటీఆర్ ప్రకటించారు. గతంలో జనాభా ఆధారిత డిలిమిటేషన్ వల్ల జనాభా నియంత్రణను సమర్థవంతంగా పాటించిన తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో తీవ్ర అన్యాయం జరుగుతుందని, సీట్ల సంఖ్య తగ్గుతుందని బీఆర్ఎస్ తీవ్రంగా నిరసించింది. అయితే ఇప్పుడు నిష్పత్తి మారకుండా సీట్లు పెంచితే మద్దతిస్తామని చెప్పడం ద్వారా డిలిమిటేషన్ పై బీఆర్ఎస్ తన వైఖరిని సవరించుకుందా , కొత్త షరతును తెరపైకి తెచ్చిందా అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా, అందులో ఐదు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళల వాటా దాదాపు 24 శాతంగా అంటే 129 సీట్లు ఉంది. ఒకవేళ జనాభా లెక్కల ప్రాతిపదికన మాత్రమే డిలిమిటేషన్ చేపడితే జనాభా విస్ఫోటనం చెందిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు విపరీతంగా పెరిగి, జనాభాను కట్టడి చేసిన దక్షిణాది వాటా 18 నుండి 20 శాతానికి పడిపోతుందనే ఆందోళన ఉంది. ఈ క్రమంలోనే కేటీఆర్ ఢిల్లీలో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్యాన్ని అలాగే కాపాడుతూ, లోక్‌సభ స్థానాల మొత్తం సంఖ్యను పెంచినప్పుడు అదే నిష్పత్తిలో దక్షిణాది సీట్లను కూడా పెంచాలి అని ప్రతిపాదించారు.
ఇదే ప్రతిపాదన చేస్తున్న బీజేపీ
ఈ ప్రతిపాదన వెనుక బీఆర్ఎస్ వ్యూహాత్మక ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం డిలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగనివ్వం, సీట్ల ప్రాతినిధ్యం తగ్గదు అని పలుమార్లు హామీలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలను ప్రాతిపదికగా తీసుకుంటూనే, బీఆర్ఎస్ ఒక షరతులతో కూడిన మద్దతు అనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనివల్ల నియోజకవర్గాల పెంపును సూత్రప్రాయంగా వ్యతిరేకించకుండానే, దక్షిణాది హక్కుల పరిరక్షణకు తామే గళం విప్పుతున్నామనే పొలిటికల్ మైలేజ్‌ను దక్కించుకోవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో డిలిమిటేషన్‌ను తీవ్రంగా నిరసించిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుత నిష్పత్తి ఫార్ములాను ప్రతిపాదించడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తమిళనాడులోని డిఎంకే, , కర్ణాటక నేతలు కూడా ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మీడియా వేదికగా కేటీఆర్ మాట్లాడటం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం పోరాడే ప్రధాన ప్రాంతీయ శక్తిగా బీఆర్ఎస్‌ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారింది.
బీజేపీకి వ్యతిరేకంగా మారే చాన్స్ లేదు!
తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు పెరిగితే ప్రతిష్టాత్మక స్థానాల్లో పోటీ పెరగడం, కొత్త నాయకత్వానికి అవకాశాలు దక్కడం వంటి పరిణామాలు ఉంటాయి. అందుకే పునర్విభజన ప్రక్రియ వేగవంతం కావడం తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నింటికీ అంతర్గతంగా అవసరమే. అయితే ఈ మార్పులు ఏ ప్రాతిపదికన జరుగుతాయనేది అసలు పాయింట్. బీఆర్ఎస్ డిలిమిటేషన్‌కు గుడ్డిగా అనుకూలంగా మారలేదు, కానీ దక్షిణాది వాటా తగ్గకూడదు అనే కచ్చితమైన ఫార్ములాతో నిబంధనలతో కూడిన మద్దతును ప్రకటించింది. కేటీఆర్ లేవనెత్తిన ఈ 24 శాతం నిష్పత్తి సూత్రానికి కేంద్రం కట్టుబడి ఉంటే డిలిమిటేషన్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండవు; లేనిపక్షంలో ఇదే అంశాన్ని కేంద్రంపై, కాంగ్రెస్ బీజేపీ ల పై మరో పెద్ద రాజకీయ అస్త్రంగా మలచుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది.