Take a fresh look at your lifestyle.

ఎల్ నినో ను ఎదుర్కొనేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి

0 15

(మెట్రో న్యూస్):

  • ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు వరి వేయవద్దు
  • వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారుల సూచన మేరకు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
  • నీటి వృథాను అరికట్టాలి
  • ఉపాధి పనులు ప్రణాళిక ప్రకారం చేయాలి
  • తెలంగాణ జలసిరి పనులు ముమ్మరంగా పూర్తి చేయాలి
  • జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపకల్పన పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం

ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వివిధ శాఖల అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపకల్పన పై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల, భూగర్భ జల శాఖ, ఎన్ పీ డీ సీ ఎల్, మిషన్ భగీరథ, గ్రామీణ అభివృద్ధి శాఖ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి తదితర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రాజెక్టులలో నీటిమట్టాలు క్రమంగా తగ్గడం.. భూగర్భ జలాలు రాను రాను తగ్గుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. వ్యవసాయ అధికారులు సూచన మేరకు రైతులు వరి వేయవద్దని సూచించారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికార సూచనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు కూరగాయలు, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ తదితర పంటల సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు మండలాల వారీగా నీటి వనరుల లభ్యత ఆధారంగా పంటలు సాగు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జలసిరి కింద బోర్ వెల్ రీఛార్జి గుంతలు, పామ్ పాండ్, మ్యాజిక్ సోక్ పిట్ తదితర పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కూలీలకు వీబీజీ రామ్ జీ కింద నిర్దేశిత లక్ష్యం మేరకు ఉపాధి పనులు చేయించాలని స్పష్టం చేశారు.

మిషన్ భగీరథ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, యంత్రాలు ఇతర ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఆయా మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలకు అవసరమైన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే నీటి వృథాను అరికట్టాలని సూచించారు. అన్ని నల్లాలకు ఆన్ ఆఫ్ స్విచ్లు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఆయా మున్సిపాలిటీల, గ్రామపంచాయతీ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. భూగర్భ జల శాఖ అధికారులు జలాల లభ్యత, నీటి మట్టాలపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఎన్ పీడీసీఎల్ అధికారులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో జీవాలకు అవసరమైన గడ్డి, నీటి తొట్టిల నిర్వహణ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. అన్ని గ్రామ పంచాయతీల్లో నీటి తొట్టిల నిర్వహణ, మరమ్మత్తు, నీటిని నింపడం అంశాలను జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గడ్డి పెంపకానికి కావలసిన అన్ని విత్తనాలు ముందస్తుగా సిద్ధం చేయాలని సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని, వైద్యం, మందులు ఇవ్వాలని సూచించారు.

సమావేశంలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ముఖ్య ప్రణాళిక అధికారి సంపత్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీధర్, జిల్లా వైద్య అధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, డీపీఓ వీర భద్రయ్య, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, భూగర్భ జల, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.