ప్రజల ప్రాణాలంటే అధికారులకు లెక్కలేదా..? ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..?
ప్రధాన రహదారిపై మెయిన్ విద్యుత్ తీగలకు తాకుతున్న వృక్ష కొమ్మలు.. భయాందోళనలో స్థానికులు, వ్యాపారస్తులు
మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం.. ఎవరి పరిధిలోకి వస్తుందంటూ తప్పించుకుంటున్న వైనం!
వేములవాడ:
ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా సంబంధిత అధికారులకు పట్టింపు లేకుండా పోయిందా..? ఏదైనా భారీ ప్రమాదం సంభవించి ప్రాణనష్టం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా..? అంటూ వేములవాడ పట్టణంలోని స్థానికులు, వ్యాపారస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని లేబర్ అడ్డా ముందు ప్రధాన రహదారిపై ఉన్న భారీ వృక్షాలు ప్రస్తుతం ప్రమాదకరంగా మారాయి. రోడ్డుపక్కన పెరిగిన చెట్ల కొమ్మలు పైనుంచి వెళ్తున్న మెయిన్ విద్యుత్ తీగలకు తాకుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.సాధారణంగా చెట్లు ప్రజలకు నీడనిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి. కానీ వాటి కొమ్మలు విద్యుత్ తీగలకు తాకే పరిస్థితి ఏర్పడితే మాత్రం అవే ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. వేములవాడ పట్టణంలోని లేబర్ అడ్డా ముందు నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం ఇదే విధంగా కనిపిస్తోంది. రహదారి పక్కన పెరిగిన వృక్షాలు భారీ ఎత్తుకు చేరుకోవడంతో వాటి కొమ్మలు పైనుంచి వెళ్తున్న ప్రధాన విద్యుత్ తీగలను తాకుతున్నాయి. ముఖ్యంగా ఈదురుగాలులు వీచినప్పుడు, వర్షాలు కురిసినప్పుడు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు బలంగా తగిలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఒకవేళ విద్యుత్ తీగలు తెగిపడినా, చెట్ల ద్వారా విద్యుత్ ప్రవహించినా అక్కడ పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు. ఈ ప్రాంతం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఒకటి కావడంతో నిత్యం వందలాది మంది వాహనదారులు, పాదచారులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ప్రాంతం ప్రజలతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి రద్దీ ప్రాంతంలోనే విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తాకుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇదిలా ఉండగా, విద్యుత్ తీగల కిందనే పలువురు వ్యాపారస్తులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులు, అక్కడ పనిచేసే సిబ్బంది, వ్యాపారస్తులు ప్రతిరోజూ ఇదే ప్రమాదకర పరిస్థితుల మధ్య జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈదురుగాలులు వీచినప్పుడు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ తీగల నుంచి ఏదైనా స్పార్కింగ్ జరిగినా, తీగలు తెగిపడినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు, వ్యాపారస్తులు నిత్యం తిరిగే ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ప్రమాదం జరగకముందే స్పందించి చెట్ల కొమ్మలను తొలగించడం, విద్యుత్ తీగలకు తగలకుండా తగిన చర్యలు చేపట్టడం సంబంధిత అధికారుల బాధ్యత కాదా అని స్థానికులు నిలదీస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే ఇది తమ పరిధిలోకి రాదని, విద్యుత్ శాఖ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారని, మరోవైపు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదిస్తే అది తమ పరిధి కాదని, మున్సిపల్ అధికారులే చర్యలు తీసుకోవాలని చెబుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని విమర్శిస్తున్నారు. ప్రజల భద్రతకు సంబంధించిన ఇంతటి కీలకమైన సమస్యపై అధికారులు బాధ్యత తీసుకోకుండా ఒక శాఖ నుంచి మరో శాఖకు పంపిస్తూ ఉంటే చివరకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదం జరిగే వరకు వేచి చూసే ధోరణిని విడనాడాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకముందే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించాలని, విద్యుత్ శాఖ,మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, సమన్వయంతో చెట్ల కొమ్మలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.