- స్వశక్తితోనే సీఎం పీఠం!
- రెండోసారి గెలిచేందుకు ముఖ్యమంత్రి మైండ్‌గేమ్!
- కేసీఆర్‌పై పైచేయి కోసం మొదలైన ఆపరేషన్
- రేవంత్ రెడ్డి మిషన్ 2028
కొత్త రాష్ట్రం తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది. కుటుంబ పాలనతో లక్ష కోట్ల దోపిడీతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. ఎక్కడికి పోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలరేగిపోయి… మాజీ సీఎం కేసీఆర్‌ను అదే పనిగా అటాక్ చేస్తున్నారు. రెండో సారి కాంగ్రెస్ గెలవాలన్నా… తానే మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోవాలన్నా… కేసీఆర్‌ను అశక్తుడిని చేస్తేనే సాధ్యం అవుతుందని సీఎం గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తండ్రీ, కొడుకు, అల్లుడు, బంధుమిత్రుల దోపిడీలను ప్రజలలో పదేపదే ఎండగడుతున్నారు. బీఆర్ఎస్‌ను ఒక దోపిడీ పార్టీగా ముద్ర వేస్తున్నారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ తదితరులు వందలు, వేల ఎకరాలను ఎలా ఆక్రమించుకున్నారని గుర్తుచేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి అనేక కారణాలు తోడవ్వగా… 2028 ఎన్నికల్లో మాత్రం తనదైన స్ట్రాటజీతోనే సీఎం పీఠాన్ని అధిరోహించాలని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యారు.
నేటి రాజకీయాలలో విలువలకు తావు లేదు. గెలవడమే గీటురాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం అదే పంథాను అనుసరిస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడుతున్నారు. గడీలను బద్దలు కొట్టాలని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి క్రమంగా ప్రజలను దూరం చేయడమే లక్ష్యంగా వ్యక్తిగతం నిందలకు వెనుకాడటం లేదు. నేరుగా కేసీఆర్‌ను దూషిస్తూ… మానసికంగా కుంగదీస్తున్నారు. ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావడం లేదని, ప్రజాసమస్యలపై శ్రద్ధ లేదని, దళిత స్పీకర్ కారణంగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని జనాలలోకి తీసుకెళ్లారు. ఎర్రవల్లి వద్ద డప్పు కొట్టిన ప్రదేశాన్ని శుద్దిచేసినందుకు యావత్ దళిత సమాజం కేసీఆర్ కుటుంబాన్ని అసహ్యించుకునేలా చేయడంలో చాలావరకు రేవంత్ సక్సెస్ అయ్యారు.
2023 ఎన్నికల్లో కేవలం రెండు శాతంతోనే కాంగ్రెస్ గట్టెక్కడం తెల్సిందే. ఈసారి ఆధిక్యత 5 శాతానికి పెరగాలని ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. పార్టీకి 40 శాతం ఓట్లు రాబట్టడం ఎంత కీలకమో ముఖ్యమంత్రికి క్లారిటీ ఉంది. ఒకవైపు తాను ప్రజలకు చేరువ అవుతూనే… మరోవైపు ప్రజల దృష్టిలో కేసీఆర్‌ను విలన్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సొంత పార్టీ నేతల నుంచి సహకారం అందినా అందకపోయినా… రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో స్వశక్తితోనే సీఎం కుర్చీలో కూర్చోవాలని పాలమూరు బిడ్డ పట్టుదలగా ఉన్నారు. సిరిసిల్ల పర్యటన ఒక మొదలు మాత్రమే!
(భూంపల్లి రాజమౌళి చారి)