మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పరిశీలన – పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి – విద్యార్థులకు దిశానిర్దేశం
మెట్రో న్యూస్ రామడుగు…
రామడుగు మండల ప్రత్యేక అధికారి శ్రీమతి బండి రాజేశ్వరి గారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి సంగి రాజేశ్వరి గారు, మండల విద్యాధికారి శ్రీ రంగనాథ్ శర్మ గారితో కలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామడుగును సందర్శించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత తదితర అంశాలను స్వయంగా పరిశీలించడంతో పాటు, విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అనంతరంపదో తరగతి విద్యార్థిని, విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. ముఖ్యంగా వివిధ సంక్షేమ వసతి గృహాల నుంచి వచ్చి పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన వసతి, చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు.
పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు సిలబస్ ఎంతవరకు పూర్తయింది, పునశ్చరణ (Revision) ఎలా కొనసాగుతోంది, పరీక్షలకు విద్యార్థులు ఏ విధంగా సిద్ధమవుతున్నారు అనే విషయాలను ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీమతి బండి రాజేశ్వరి గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. తాను కూడా ఒకప్పుడు వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసించిన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. వసతి గృహంలో ఉండటం అనేది చదువుకు ఎలాంటి ఆటంకం కాదని, సరైన లక్ష్యం, క్రమశిక్షణ, నిరంతర కృషి ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ, ఎలాంటి ఇబ్బందులకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని సాధించే దిశగా కృషి చేయాలని హితబోధ చేశారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి సంగి రాజేశ్వరి గారు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, ఈ సమయంలో సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. ప్రతి విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పరీక్షల పట్ల భయాందోళనలకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో చదివి విజయాన్ని సాధించాలని ప్రోత్సహించారు.
మండల విద్యాధికారి రంగనాథశర్మ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల విజయమే పాఠశాల విద్యా ప్రమాణాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తూ, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన అందించాలని సూచించారు. సిలబస్ పూర్తి చేయడంతో పాటు నిరంతర పునశ్చరణ, నమూనా పరీక్షలు, సందేహ నివృత్తి కార్యక్రమాల ద్వారా విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సంపూర్ణంగా సిద్ధం చేయాలని తెలిపారు.
అధికారుల సూచనలు, ప్రోత్సాహకరమైన ప్రసంగాలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు తమ అనుభవాలను, అభిప్రాయాలను అధికారులతో పంచుకున్నారు.
విద్యార్థుల విద్యా ప్రగతిని తెలుసుకోవడం, వారి సమస్యలను ప్రత్యక్షంగా వినడం, వారికి భరోసా కల్పించడం, పదో తరగతి ఫలితాలను మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో ఈ పాఠశాల సందర్శన కొనసాగింది.
*విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన పదో తరగతి ఫలితాల సాధనే లక్ష్యంగా అధికారులు చేపట్టిన ఈ సందర్శన విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది.*