(మెట్రో ఈవినింగ్స్):
– ఎస్పీ మహేష్ బి గీతే
– విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరుపై అవగాహన
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థినీ, విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రపై అవగాహన కల్పించారు.
పోలీస్ స్టేషన్ పనితీరు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియ, డే, నైట్ బీట్స్, పెట్రోలింగ్ విధానాలను విద్యార్థులకు వివరించారు. నేరాల ఛేదనలో ఉపయోగించే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ పరికరాలు, సీసీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేశారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా కేంద్రాలు అందిస్తున్న సేవలు, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల గుర్తింపునకు సీఈఐఆర్ వ్యవస్థ వినియోగంపై వివరించారు. బాంబ్ స్క్వాడ్, పోలీస్ జాగిలాల విధులను పరిచయం చేశారు.
విద్యార్థులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు గణేష్, అనిల్, రంజిత్, ఆర్‌ఎస్‌ఐ సాయి కిరణ్, వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.