(మెట్రో ఈవినింగ్స్):
– ఏడాదిలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక ముద్ర
అర్హులకు సంక్షేమ పథకాలు అందించడం, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాలన సాగిస్తున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, పర్యాటకం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక కథనం.
ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు, సమీక్షలతో పర్యవేక్షిస్తున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఆర్థిక సాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటూ, ఏడాదిలో 3 వేలకుపైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా కృషి చేశారు.
విద్య, పోషణపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ బోధన, భోజనం, పారిశుద్ధ్యం, విద్యార్థుల భద్రతను పరిశీలిస్తున్నారు. బాలికల విద్యాలయాల్లో సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు, ఫ్రీజర్లు, సోలార్ ఫెన్సింగ్ వంటి సదుపాయాలు కల్పించారు. జిల్లాలోని 586 అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార పంపిణీ, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అసంపూర్తిగా ఉన్న 48 అంగన్వాడీ భవనాల పూర్తికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించారు.
వైద్య సేవలు.. సంక్షేమం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మందుల పంపిణీ, గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 2025 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ వైద్య సంస్థల్లో 3,344 ప్రసవాలు జరిగాయి. గర్భిణుల నమోదు 95 శాతం పూర్తికాగా, తల్లులు, పిల్లలకు టీకాల పంపిణీ వంద శాతం పూర్తయింది. జిల్లాలో 421 మంది టీబీ బాధితులకు పోషకాహార కిట్లు అందించారు. దివ్యాంగులకు సహాయక పరికరాలు, వృద్ధులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
ఎల్‌నినో ప్రభావం, నీటి వనరుల పరిమితులను దృష్టిలో ఉంచుకుని వరికి ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. రైతు వేదికలు, గ్రామసభల ద్వారా అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో కొత్తగా 700 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు. ఉపాధి హామీ పనుల్లోనూ జిల్లా రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలిచేలా చర్యలు తీసుకుంటున్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధికి పర్యవేక్షణ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయం, 80 అడుగుల రహదారి నిర్మాణ పనులను కలెక్టర్ క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల అమలుపైనా దృష్టి సారించారు. గుడి చెరువు బండ్ పార్కు, నాంపల్లి గుట్ట, రగుడు జంక్షన్లలో పర్యాటక ఆకర్షణలను అభివృద్ధి చేస్తున్నారు.
ఎన్నికల నిర్వహణలో గుర్తింపు
దుబ్బాక నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా పనిచేసిన సమయంలో ఎన్నికలను సమర్థంగా నిర్వహించినందుకు గరిమ అగ్రవాల్ ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డుకు ఎంపికయ్యారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.
మౌలిక వసతుల కల్పన
జిల్లాలో గోదాముల నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి భవనాలు, గ్రామాల్లో వీఓ భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వివిధ శాఖలతో సమీక్షలు నిర్వహిస్తూ రహదారి భద్రతా చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా సంక్షేమం, అభివృద్ధి, ప్రజా సేవలను సమన్వయం చేస్తూ జిల్లా ప్రగతికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కృషి చేస్తున్నారు.