హైదరాబాద్ (మెట్రో న్యూస్):
భూసేకరణ వేగవంతం చేయాలి
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ ప్రాజెక్టు రెండో ఫేజ్‌కు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ సేకరణ ను వేగవంతం చేయాలని.. ల్యాండ్ పోలింగ్ పైన స్పష్టమైన విధానం రూపొందించుకోవాలని సూచించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణ పైన స్పష్టమైన విధానం తయారు చేసుకోవాలన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి వచ్చే రుణాలపైన మునిసిపల్ కమిషనర్లు దృష్టి పెట్టాలని… టీడీఆర్ పైన ప్రతి వారం సమీక్ష జరగాలని.. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయం టెండర్లు తక్షణం పిలవాలని… కొత్వాల్ గూడా బర్డ్స్ పార్క్‌కు మరింత ప్రచారం కల్పించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలిచ్చారు.
మంగళవారం ఎంసీఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్లో మూసీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, రంగా రెడ్డి జిల్లా నారాయణ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈ.వి.నరసింహ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ జేఎండీ గౌతమి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.