- కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు
![]()
- ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను
రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది - మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ (మెట్రో న్యూస్):
పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రజా ప్రభుత్వం వెనక్కి తగ్గదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూశామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి విడుదల కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతో ఇప్పటివరకు పూర్తయిన ఇళ్లకు సంబంధించిన చివరి బిల్లుల చెల్లింపును తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రధానమంత్రి మోదీని, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను పలుమార్లు కలిసి తెలంగాణకు ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసిందని మంత్రి గుర్తుచేశారు.
కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశ పెట్టుకుని పేద ప్రజలను ఇంకా ఎన్నాళ్లు ఇబ్బంది పెట్టాలి? ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారుడు చివరి బిల్లు కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కేంద్రం తన బాధ్యత నిర్వర్తించకపోయినా పేదవాడి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించక పోయిన కూడా పేదల సొంతింటి కలను నెరవేర్చడాన్ని ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. మార్చి 31వ తేదీ వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం నాడు జమ అవుతాయని తెలిపారు. మిగిలిన వారికి కూడా విడతల వారీగా ఇస్తాం . ఇందులో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.