వర్కింగ్ జర్నలిస్టుల ఇంటి స్థలాలను రెగ్యులరైజ్ చేయాలి తహసీల్దార్‌కు రాజన్న హిల్స్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ సొసైటీ వినతి
వేములవాడ పట్టణంలోని వర్కింగ్ జర్నలిస్టులకు నాంపల్లి శివారులోని సర్వే నంబర్ 391లో కేటాయించిన ఇంటి స్థలాలను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేసి, జర్నలిస్టులకు న్యాయం చేయాలని రాజన్న హిల్స్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, వేములవాడ ఆధ్వర్యంలో తహసీల్దార్ జయంత్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కొల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వర్కింగ్ జర్నలిస్టులు తమ వృత్తి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నాంపల్లి శివారులోని సర్వే నంబర్ 391లో సుమారు 60 మంది జర్నలిస్టులకు గతంలో ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు వాటిని పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్ చేయకపోవడంతో సంబంధిత జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
స్థలాల కేటాయింపు జరిగి చాలా కాలం గడిచినా చట్టబద్ధమైన హక్కులు పొందలేకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణం, బ్యాంకు రుణాలు పొందడం, ఇతర ప్రభుత్వపరమైన ప్రక్రియల్లో సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. జర్నలిస్టులు తమ కుటుంబాల భవిష్యత్తు కోసం కేటాయించిన స్థలాలపై పూర్తి హక్కులు పొందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, గతంలో కేటాయించిన ఇంటి స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని కొల్లూరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సర్వే నంబర్ 391కు సంబంధించిన రికార్డులను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ జయంత్ కుమార్ సంబంధిత రికార్డులను పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇంటి స్థలాల సమస్య పరిష్కారమైతే సుమారు 60 మంది జర్నలిస్టులతో పాటు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.