హైదరాబాద్ (మెట్రో న్యూస్):
విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ పొదుపుపైనా దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే అవసరం లేకుండా పొదుపు చేసే విద్యుత్ యూనిటే చౌకైనది అన్నారు. హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో బుధవారం జరిగిన ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్-2026’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ఉపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇంధన పొదుపుతో దేశానికి మరింత ఇంధన భద్రత. ప్రతి యూనిట్ విద్యుత్ పొదుపు పెరుగుతున్న డిమాండ్‌ను నిర్వహించేందుకు దోహదం చేస్తుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు.

స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్తో విద్యుత్ వృథాను అరికట్టాలి. ప్రతి మెగావాట్ విద్యుత్ డిమాండ్ తగ్గితే విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుంది. అభివృద్ధి వేగాన్ని తగ్గించడం పరిష్కారం కాదు.. ప్రతి యూనిట్ విద్యుత్‌తో మరింత ఆర్థిక కార్యకలాపాలు సాధించాలని చెప్పారు. ఏఐతో విద్యుత్ వృథాను గుర్తించి వినియోగాన్ని మరింత సమర్థవంతం చేయాలి. భవిష్యత్తులో కర్మాగారాలు కేవలం విద్యుత్ వినియోగదారులు కాకుండా విద్యుత్ వ్యవస్థలో చురుకైన భాగస్వాములు కావాలి. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమలకు మూడు సూచనలు చేశారు. కొలవాలి.. పంచుకోవాలి.. విస్తరించాలి అని సూత్రీకరించారు. మరింత ఉత్పత్తి చేయాలి.. మరింత అభివృద్ధి చెందాలి.. వృథాను తగ్గించాలి.