మహిళలు ముప్పై ఏళ్ల చివరి దశలో నెలసరి క్రమం తప్పడం, నిద్రలేమి, ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలను పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల వల్ల కలిగేవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇవి రుతువిరతికి ముందు దశ లక్షణాలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ మహిళల్లో రుతువిరతి సగటున 46 నుంచి 47 ఏళ్ల మధ్య వస్తుంది. అందువల్ల చాలామంది మహిళలు తమ వృత్తి జీవితంలో కీలక దశలోనే ఈ మార్పులను ఎదుర్కొంటున్నారు.
ఈ వయస్సుల వారిలో ఎక్కువ..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, 2019-21లో 35 నుంచి 39 ఏళ్ల వివాహిత మహిళల్లో 5.5 శాతం మంది రుతువిరతి దశలో ఉన్నట్లు నమోదైంది. రుతువిరతికి ముందు నెలసరి క్రమం మారడం, వేడి ఆవిర్లు రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం, నిద్రకు ఆటంకం, మానసిక స్థితిలో మార్పులు, కీళ్ల నొప్పులు, శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే థైరాయిడ్ సమస్యలు, గర్భధారణ, ఇతర హార్మోన్ల మార్పులు కూడా ఇలాంటి లక్షణాలకు కారణమవుతాయి. 45 ఏళ్లలోపు నెలసరి క్రమం తప్పినా, 40 ఏళ్లలోపే ఆగిపోయినా వైద్యులను సంప్రదించాలి.
ఏం చేయాలి..
ముందస్తు రుతువిరతి వల్ల నెలసరి, సంతానోత్పత్తిపైనే కాకుండా ఎముకలు, గుండె ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం పెరుగుతుంది. నిద్రలేమి, అలసట, ఏకాగ్రత తగ్గడం ఉద్యోగ పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. వైద్యులు లక్షణాలు, నెలసరి చరిత్రను పరిశీలించి అవసరమైన పరీక్షలు సూచిస్తారు. కొందరికి హార్మోన్ చికిత్స అవసరమవుతాయి. అయితే వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు. మహిళలు ముప్పై ఏళ్ల మధ్య నుంచే నెలసరి తేదీలను నమోదు చేసుకుంటూ, నిద్ర, మానసిక స్థితి, శక్తిలో మార్పులను గమనించాలి. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత కాల్షియం పొందడం, అవసరమైతే విటమిన్ డి పరీక్షలు చేయించుకోవడం, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయడం మంచిది. తగిన నిద్ర, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు కూడా ముఖ్యమే. లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్య సహాయం పొందడం ద్వారా మహిళలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.