(మెట్రో న్యూస్):
మునగాల మండల వ్యాప్తంగా రైతులపరిస్థితిఅగమ్యగోచరంగా మారింది. వేసిన పంటలకు నీరు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లక్షల రూపాయలు అప్పులు చేసి సాగు చేసిన పంట పొలాలు నీరు లేక కళ్ల ముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో మునగాల మండలంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. బోర్లు, బావుల్లో నీటిమట్టం అడుగంటిపోయింది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్నా కాలువలకు నీరు రాకపోవడంతో వరి, పత్తి, మిర్చి పంటలు ఎండుముఖం పట్టాయి.
మండలంలోని తాడవాయి,నేలమర్రి,మాదావరం,రేపాల,నర్సింహుల గూడెం,జగ్నదాపురం,
కలకోవ, తదితర గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టినా చేతికి పంట వచ్చే దశలో నీరు లేక పంటలు చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకులో రుణం తెచ్చి మరీ మిర్చి వేశా. మోటార్లు కాలిపోతున్నాయి, బోర్లలో చుక్క నీరు లేదు. పంట కళ్ల ముందే ఎండిపోతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాం” అని ఓ రైతు కన్నీటి పర్యంతమయ్యారువెంటనే ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రైతుల ప్రధాన డిమాండ్లు:
– పంట నష్ట అంచనా: వెంటనే వ్యవసాయ అధికారులతో క్షేత్ర స్థాయిలో సర్వే చేయించాలి.
– నష్టపరిహారం: ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి.
– రుణ మాఫీ, ఇన్సూరెన్స్: పంట రుణాలు మాఫీ చేసి, పంటల బీమా తక్షణమే అమలు చేయాలి.
అధికారులు మాత్రం పై మాటలతో సరిపెడుతున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.