(మెట్రో న్యూస్):
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ శాసనసభలోని దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్లో గురువారం వీరయోధుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174 వ జయంతి, ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , శాసన మండలి సెక్రెటరీ డా. నరసింహా చార్యులు, శాసన సభ సెక్రెటరీ ఆర్ .తిరుపతి , తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నేల పోరాటాలకు, త్యాగాలకు, ఆత్మగౌరవానికి నిలయమని ఆయన పేర్కొన్నారు. సామాజిక అసమానతలు, దోపిడీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఆదివాసీల హక్కుల కోసం, అడవి, భూమి, నీటిపై వారి హక్కులను కాపాడేందుకు పోరాడిన గొప్ప యోధుడు కొమురం భీం అని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన వీరోచిత పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
అదేవిధంగా పండుగ సాయన్న ముదిరాజ్ తెలంగాణ సమాజంలో అణగారిన వర్గాల పక్షాన నిలిచిన గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు. నాటి సమాజంలో పేదలు, బలహీన వర్గాలపై జరుగుతున్న దోపిడీ, అన్యాయాలను ఎదిరించి ప్రజల కోసం పోరాడిన ధైర్యశాలి పండుగ సాయన్న అని కొనియాడారు.
కొమురం భీం, పండుగ సాయన్న ముదిరాజ్ వంటి మహనీయుల పోరాటాల వెనుక సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం వంటి గొప్ప ఆశయాలు ఉన్నాయని తెలిపారు.
మహనీయుల జయంతి వేడుకలను నిర్వహించుకోవడం మాత్రమే కాకుండా, వారు కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహనీయుల చరిత్రను పుస్తకాలకే పరిమితం చేయకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుంది” అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొమురం భీం ఆదివాసీల ఆరాధ్య దైవమని, గోండు బెబ్బులిగా ప్రసిద్ధి చెందిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు.
అడవితల్లి ఒడిలో పుట్టిన ఆత్మగౌరవానికి కొమురం భీం ప్రతీక అని, ఆదివాసీ హక్కుల కోసం ఎగిసిన తిరుగుబాటు జెండా ఆయన అని పేర్కొన్నారు.
“జల్, జంగల్, జమీన్” నినాదంతో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు.
అదేవిధంగా పండుగ సాయన్న ముదిరాజ్ నాటి నిజాం నిరంకుశ పాలన, దొరల దోపిడీ, సామాజిక అన్యాయాలను ఎదిరించిన తెలంగాణ వీరుడని కొనియాడారు.సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు .