Take a fresh look at your lifestyle.

రాజీనామానా… స‌స్పెండా

0 36

మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో హైక‌మాండ్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌!                                               

డిప్యూటీ సీఎం భ‌ట్టితో మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి భేటీ

(మెట్రో న్యూస్ బ్యూరో)

మంత్రి కొండా సురేఖ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. త‌మ కూతురు సుస్మిత వ్యాఖ్య‌ల‌తో సంబంధం లేద‌ని కొండా దంప‌తులు ఇద్ద‌రూ స‌మాధానం చెప్పిన నేప‌థ్యంలో ఈ ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. మంత్రిపై చ‌ర్య‌ల‌కు క్ర‌మశిక్ష‌ణ క‌మిటీ సిఫార‌సు చేయ‌డంతో పార్టీ హైక‌మాండ్ కోర్టులోకి బంతి వెళ్లిప‌డింది. అక్క‌డినుంచి ఎలాంటి నిర్ణ‌యం వ‌స్తుందో సస్పెన్స్‌గా మారింది. ఆమెను కేబినెట్ నుంచి తొల‌గిస్తే.. పార్టీకి ఏమాత్రం డ్యామేజీ అవుతుందని నిఘా విభాగం తమ పని అప్పుడే మొదలుపెట్టింది. ముఖ్యంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లో కొండా కుటుంబం ప్రభావం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. సురేఖను స్వ‌యంగా మంత్రి ప‌ద‌వికి రాజీనామాకు అంగీకరించేలా ఒప్పించాల‌ని… ఆ బాధ్య‌త‌ను భట్టి, సీనియ‌ర్ మంత్రులు, నాయ‌కుల‌కు అప్ప‌గించార‌ని స‌మాచారం.

అందుకే… మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళిని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌జాభ‌వ‌న్‌కు పిలిపించుకున్నార‌ట! అర‌గంట‌కు పైగా వారి చర్చ రాజీనామా, సస్పెన్షన్ విష‌యం చుట్టూ జరిగిందని అంటున్నారు. రాష్ట్ర నాయ‌క‌త్వ‌మే కాకుండా.. జాతీయ నాయ‌క‌త్వం కూడా మంత్రి సురేఖ‌పై ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు ముర‌ళికి ఉప‌ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు. రాజీనామా చేయాల‌ని సూచించిన‌ట్టు భోగ‌ట్టా! తర్వాత ఏం చేయాలో పార్టీ చూసుకుంటుందని కూడా భట్టి సూచనప్రాయంగా చెప్పారట! భ‌ట్టి-ముర‌ళి భేటీ స‌మ‌యంలో సీనియ‌ర్ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కూడా ఉండ‌టంతో.. ఆ ఇద్ద‌రు సీనియ‌ర్లు హైక‌మాండ్ నిర్ణ‌యాన్ని ముర‌ళికి స్ప‌ష్టంగా చెప్పార‌నే వినికిడి!

డిప్యూటీ సీఎంతో స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడిన ముర‌ళి… త‌న కూతురుకు మాట్లాడే స్వ‌తంత్రం ఉంద‌ని, క‌విత కూడా బ‌య‌ట‌కు వెళ్ల‌లేదా అంటూ కామెంట్ చేయ‌డం, కొండా సురేఖ‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేద‌న్న‌ట్టుగా… ఆమె అధికారిక కార్య‌క్రమాల‌కు హాజ‌ర‌వుతోంద‌నీ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అలాగే త‌మ కుటుంబానికి గాంధీ కుటుంబంపై సంపూర్ణ విశ్వాసం ఉంద‌నీ పేర్కొన్నారు. అంటే రాష్ట్ర నాయ‌క‌త్వాన్ని సురేఖ కుటుంబం లెక్క‌చేయ‌డ‌డం లేద‌నే అభిప్రాయం బ‌య‌ట‌కు వెళ్తోంది. ముర‌ళి లాగే భ‌ట్టితో స‌మావేశ‌మైన ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి కూడా ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డికే ఓటు వేయ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

Leave A Reply

Your email address will not be published.