హైదరాబాద్ (మెట్రో న్యూస్):
22ఏ సమస్యల పరిష్కారంలో మరో కీలక అడుగు
కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ్యవసాయ భూములుగా ఉన్న పట్టా భూములు, అనంతరం నివాస వినియోగంలోకి వచ్చినప్పటికీ నాలా ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ శనివారం నాడు మెమో జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు మెమో నెంబర్ 48062/ULC/A1/2026 ద్వారా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
నాలా ప్రక్రియ పూర్తికాకపోవడం వల్ల రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే ఉండి, 22ఎ లో ఉన్న నివాస పట్టా భూముల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రభుత్వ రుసుములను వసూలు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. అంతకుముందు రెవెన్యూ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 22ఎ సమస్యల పరిష్కారం కోసం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్ధాయిలో పకడ్బందీగా అమలయ్యే విధంగా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాకోణంలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలు చేయాల్సిన కనీస బాధ్యత అధికారులపై ఉందని ఆ బాధ్యతను అధికారులు సరైన విధంగా నిర్వర్తిస్తే సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని అన్నారు.