(మెట్రో న్యూస్):
వినాయక చవితి సందర్భంగా రాయపర్తిలోని బ్లూమింగ్ బడ్స్ స్కూల్‌లో విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయంగా మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ తమ సృజనాత్మకతను చాటుకున్నారు.
ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకు సహకరిస్తూ “మట్టి వినాయకుడు – పర్యావరణానికి మేలు” అనే సందేశాన్ని అందించారు. పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా ప్రకృతితో పాటు నీటి వనరులను పరిరక్షించవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ ఎనగందుల సంతోష్ మాట్లాడుతూ.. పండుగల నిర్వహణతో పాటు విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ, సృజనాత్మకతను పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు. మట్టి వినాయక విగ్రహాల తయారీలో విద్యార్థులు చూపిన ప్రతిభను ఆయన అభినందించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, శ్రీవాణి, చైతన్య, పద్మ, సుమలత, శైలజ, రజిత, అనిత, మమత, సిరివల్లిక తదితరులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.