Take a fresh look at your lifestyle.

అన్ని స్థాయిలలో ప్రజావాణి ఫిర్యాదుల పెండెన్సీ తగ్గించాలి జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్.

0 22

మెట్రో న్యూస్.
అన్ని స్థాయిలలో ప్రజావాణి ఫిర్యాదుల పెండెన్సీ తగ్గించాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
మండల, డివిజన్ స్థాయి ప్రజావాణిలో స్థానిక సంస్థలు, రెవెన్యూ ,అంశాలకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదుల పెండేన్సీ ఎక్కువగా ఉందని, వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి లను ఆదేశించారు.
జిల్లా అధికారులందరూ గతంలో ఆదేశించినట్లుగానే హాస్టళ్ల తనిఖీ నిర్వహించి తప్పనిసరిగా నివేదిక సమర్పించాలని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 11 అంశాలలో సాధించిన లక్ష్యాలపై ఈనెల 6లోగా నివేదిక సమర్పించాలని ,త్వరలోనే నిర్వహించనున్న” దిశ” సమావేశానికి అధికారులందరూ నివేదికను సమర్పించాలని, ప్రజాప్రతినిధుల ద్వారా ,సీఎం కార్యాలయం, వీఐపీలు, చీఫ్ సెక్రటరీ ,ప్రజావాణి, సిపిఆర్ఓ ద్వారా వచ్చిన రిఫరెన్స్లకు తీసుకున్న చర్య పై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని, సెప్టెంబర్ నెల పర్యటన వివరాలను తక్షణమే సమర్పించాలని, ప్రతిరోజు వార్తాపత్రికలలో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలకు సంబంధిత శాఖల అధికారులు స్పందించడమే కాకుండా, తీసుకున్న చర్యను లేదా వివరణను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
ఈ నెల 5 నుండి 12 వరకు సమాచార హక్కు చట్టంపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా అధికారులందరూ వారి వద్ద పెండింగ్లో ఉన్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, అప్పీల్ దరఖాస్తులపై నిర్దేశించిన ప్రొఫార్మాలో సమాచారం ఇవ్వాలని, సమాచార చట్టం కింద వచ్చిన దరఖాస్తులన్నిటిని ఎప్పటికప్పుడు పారదర్శకంగా పరిష్కరించాలని చెప్పారు. త్వరలో ప్రారంభం కానున్న పత్తి, ధాన్యం సేకరణకు ఏర్పాట్లతోపాటు, పర్యవేక్షణ చేయాలని , సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు పరిమితికి మించి వినియోగించే అవకాశం ఉన్న ప్రాంతాల సంఖ్య ప్రతి నెల పెరుగుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా అంతటా ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడం, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా తాగునీటి పైప్లైన్ లీకేజీలు ఉంటే వెంటనే అరికట్టాలని, విబిజి రాంజీ కింద నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజల్లో పెద్ద ఎత్తున నీటి సంరక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని, గ్రామాలలో ఎక్కడైనా తాగునీటి కొరత ఉంటే అవసరమైతే నీటి వనరులు అద్దెకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, వాల్టా అనుమతి లేకుండా కొత్త బోర్లు తవ్వేందుకు వ్యక్తులకు, సంస్థలకు అనుమతి మంజూరు చేయవద్దని, ఈనెల 8 లోగా చేయూత పెన్షన్లు దరఖాస్తులను పరిశీలించి పంపించాలని ఆదేశించారు .
ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టంపై రూపొందించిన ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్ అధికారులందరి చేత చేయించారు.
కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖ 55, ఇతర శాఖలకు 86 మొత్తం 141 దరఖాస్తులను ప్రజలు సమర్పించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిఆర్ఓ దశరథ ,జిల్లా అధికారులు, ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

Leave A Reply

Your email address will not be published.