రాయచూర్ (మెట్రో న్యూస్):
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శన.


రక్షాబంధన్ పండగ రోజున తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక రాష్ట్రం, రాయచూర్ జిల్లాలోని ‘హట్టి గోల్డ్ మైన్’ను శుక్రవారం ఉదయం సందర్శించారు. దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బంగారం ఉత్పత్తి సంస్థలోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ధి కేంద్రం మరియు ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని ఉప ముఖ్యమంత్రికి వివరంగా తెలియజేశారు. హట్టి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతిరోజు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు వివరించారు. సింగరేణి సంస్థ వేలంలో దక్కించుకున్న ‘దేవదుర్గ బంగారం-రాగి ఖనిజ అన్వేషణ బ్లాక్’ కూడా ఈ హట్టి గోల్డ్ మైన్స్ సమీపంలోనే ఉండటం గమనార్హం.
సందర్శనలో భాగంగా భట్టి విక్రమార్క భూగర్భ గనితో పాటు ఓపెన్ కాస్ట్ గనిని కూడా పరిశీలించారు. మైన్ వ్యూ పాయింట్ నుండి బంగారం ముడి మట్టి వెలికితీత ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు. ఎంత లోతు నుంచి బంగారం ముడి సరుకు సేకరిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. బంగారం ఖనిజ గనికి సంబంధించిన సమగ్ర మ్యాప్‌లను లోతుగా పరిశీలించారు. గడిచిన 5 ఏళ్ల బంగారు ఉత్పత్తి వివరాలను భట్టికి నివేదించిన మైనింగ్ అధికారులు. ఓపెన్ కాస్ట్‌తో పాటు భూగర్భ (అండర్‌గ్రౌండ్) గని ఉత్పత్తుల వివరాలపై ఆయన ఆరా తీశారు. యుటి ఓపెన్ కాస్ట్ గోల్డ్ మైన్‌లో ఉప ముఖ్యమంత్రి మొక్కను నాటారు. డిప్యూటీ సీఎం వెంట సింగరేణి సిఎండి బుద్ధ ప్రకాష్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జిఎమ్ పంకజ్ కులశ్రేష్టలతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.