Take a fresh look at your lifestyle.

తెలంగాణకు బీసీ సీఎం.. కానీ ఇప్పుడే కాదు: మహేశ్ గౌడ్

0 18
  • బీసీ వ్యక్తి సీఎం కావడానికి డెడ్‌లైన్ ఏమీ లేదన్న మహేశ్ గౌడ్
  • రేవంత్ రెడ్డి పాలన 2039 వరకు కొనసాగుతుందని విశ్వాసం
  • కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణకు బీసీ సీఎం సాధ్యమని వ్యాఖ్య

తెలంగాణకు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి ఎలాంటి గడువులు లేవని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన, సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా ఉందని మహేశ్ గౌడ్ ప్రశంసించారు. ఈ పనితీరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 2034 వరకే కాదని, 2039 వరకు కూడా అధికారంలో ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపేందుకే రేవంత్ రెడ్డి 2034 వరకు తానే సీఎంగా ఉంటానని చెప్పారని, అందులో తప్పేమీ లేదని అన్నారు. వచ్చే టర్మ్‌లో మళ్లీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తమకు ఎలాంటి తొందర లేదని, భవిష్యత్తులో బీసీ నేతకు అవకాశం వస్తుందని పేర్కొన్నారు.

బీసీ సీఎం నినాదం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన అని మహేశ్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేయగలదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. కొండా సురేఖ విషయంలో ఆమె కుమార్తె సుస్మిత తొందరపడి వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని, రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.