Take a fresh look at your lifestyle.

ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

0 10

న్యూఢిల్లీ (మెట్రో న్యూస్‌):

సమ్మక్క–సారక్క బ్యారేజీగా పిలిచే సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు అనుమతిని (ఎన్‌ఓసీ) వీలైనంత త్వరగా జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూములు, ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుందని, అవసరమైతే పరిహార నిధులను ముందుగానే జమ చేసేందుకు కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, పరస్పర సహకారం, సంప్రదింపుల ద్వారా పెండింగ్‌ అంశాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌ సాయితో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సమ్మక్క సాగర్‌కు సంబంధించిన అంతర్రాష్ట్ర అంశాలు, బ్యాక్‌వాటర్‌ ప్రభావం, ముంపునకు గురయ్యే భూములు, నివాస గృహాలు, బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఓసీ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమ్మక్క సాగర్‌ బ్యారేజీలో పూర్తి జలాశయ మట్టం వరకు నీటిని నిల్వ చేసి, ప్రాజెక్టు నిర్దేశిత సాగునీటి ప్రయోజనాలను రైతులకు అందించేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ముంపు ప్రభావిత కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం భూములు, ఇళ్లు, ఇతర ఆస్తులకు పరిహారాన్ని అంచనా వేసి పూర్తిస్థాయిలో చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.