- తిరుపతి రూరల్ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా ధనలక్ష్మి.. వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి కుమారుడు
- ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన నాని, చెవిరెడ్డి కుటుంబాలు
- ఇరు వర్గాలు ఒకే చోట ఉండటంతో వేడెక్కిన వాతావరణం
రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా, తిరుపతిలోని కౌంటింగ్ కేంద్రంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబాలు ఒకే కేంద్రానికి చేరుకోవడం స్థానికంగా ఉత్కంఠ రేపింది.
వివరాల్లోకి వెళితే, తిరుపతి రూరల్ జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనయుడు హర్షిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు చెవిరెడ్డి తన భార్యతో కలిసి కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. అదే సమయంలో, ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి ధనలక్ష్మి తరఫున పులివర్తి నాని తన భార్య సుధారెడ్డితో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాలు ఒకేచోట ఉండటంతో వాతావరణం కాస్త వేడెక్కింది.
ఇటీవల పోలింగ్ రోజున పులివర్తి నాని భార్య సుధారెడ్డి, చెవిరెడ్డి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఘర్షణలు జరగకుండా ఉండేందుకు “అన్నా.. ఇద్దరం ఒకే కారులో వెళ్దాం” అని సుధారెడ్డి ప్రతిపాదించడం, దానికి చెవిరెడ్డి మౌనంగా ఉండిపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలోని పరిణామాల తర్వాత, ఇప్పుడు ఓట్ల లెక్కింపు కోసం ఇరు కుటుంబాలు ఒకే కేంద్రంలో ఉండటంతో స్థానికంగా ఇది మరోసారి చర్చకు దారితీసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.