హైదరాబాద్ : మెట్రో న్యూస్
బీజేపీలో అంతర్గత అసంతృప్తి రోజు రోజుకి చర్చనీయాంశంగా మారుతోంది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారైందన్న ప్రచారం నేపథ్యంలో పార్టీలోని కొందరు నేతలు, కార్యకర్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు ఎప్పుడు అవకాశం వస్తుందన్న ప్రశ్న అసంతృప్తి వర్గాల నుంచి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.ఒకవైపు పార్టీ నాయకత్వం గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంటే, మరోవైపు కొందరు నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా కొందరు మొక్కుబడిగా హాజరవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాంచందర్‌రావు అభ్యర్థిత్వంపై పార్టీలోని ఆశావహులు, వారి అనుచరుల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసిన తమను పక్కనపెట్టి, ఇప్పటికే పదవులు అనుభవించిన వారికే మళ్లీ అవకాశాలు కల్పిస్తారా అన్న ప్రశ్న కొందరు నేతల నుంచి వినిపిస్తోంది .ఈ నేపథ్యంలో పార్టీలోనే రెండు రకాల ప్రచారాలు సాగుతున్నాయనే చర్చ ఉంది. ఒక వర్గం రాంచందర్‌రావు అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలుస్తుంటే, మరో వర్గం మాత్రం ఆయన పోటీపై అంతగా ఆసక్తి చూపడం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మన నాయకుడు గెలవడు.. ఈ పోటీ ఎందుకు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముందుగా ఓటరు నమోదు ప్రక్రియ కీలకం. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా రాంచందర్‌రావు కూడా పార్టీ సమావేశాల్లో స్పష్టం చేశారు.అయితే అంతర్గత అసంతృప్తి కారణంగా కొందరు నాయకులు ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకరించడం లేదన్న చర్చ పార్టీకి కొత్త సవాలుగా మారింది. ఎన్నికల సమయంలో అందరూ ఒక్కతాటిపైకి వస్తారాలేక వ్యక్తిగత రాజకీయ అసంతృప్తులు పార్టీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం.
ఇక్కడే రాంచందర్‌రావుకు రాజకీయంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అభ్యర్థిగా బరిలోకి దిగితే గెలుపు పార్టీ సమష్టి కృషిగా పరిగణించబడుతుంది. కానీ ఓటమి ఎదురైతే మాత్రం రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వం, పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడంలో ఆయన పాత్రపై చర్చ మొదలయ్యే అవకాశం ఉంటుంది.
అదే సమయంలో టికెట్ ఆశించిన ఇతర నాయకులకు అవకాశం దక్కకపోతే వారి రాజకీయ భవిష్యత్తు, పార్టీలో ప్రాధాన్యత వంటి అంశాలు కూడా తెరపైకి వస్తాయి. ఒకవైపు అధిష్ఠానం నిర్ణయం.. మరోవైపు ఆశావహుల ఆకాంక్షలు.. ఇంకోవైపు క్షేత్రస్థాయిలో క్యాడర్ సమన్వయం.. ఇవన్నీ ఇప్పుడు బీజేపీ రాజకీయాల్లో కీలకంగా మారాయి.
పార్టీలో అంతర్గత విభేదాలు, టికెట్ ఆశించి భంగపడిన నేతల అసహకారం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరాసక్తత కొనసాగితే అవి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా పట్టభద్రుల ఓటర్ల నమోదు నుంచే పార్టీ యంత్రాంగం చురుగ్గా పనిచేయాల్సిన సమయంలో అంతర్గత అసంతృప్తి అడ్డంకిగా మారితే పరిస్థితులు క్లిష్టమవుతాయి.గెలుపు కోసం అందరూ పనిచేస్తేనే ఫలితం.. లేకుంటే సొంత పార్టీ అసంతృప్తే రాజకీయ సవాలుగా మారే ప్రమాదం ఉంది.