- 1463 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి భారతి విజయం
- ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ పరాజయం
- జడ్పీటీసీ విజయంతో టీడీపీ శ్రేణుల్లో మిన్నంటిన సంబరాలు
వైసీపీకి దాని కంచుకోట అయిన పులివెందులలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ పరాజయం పాలైన వైసీపీ… తాజాగా పరిషత్ ఎన్నికల్లోనూ ఓటమిని చవిచూసింది. ఈరోజు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
పులివెందుల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భారతి విజయం సాధించారు. ఆమె తన సమీప వైసీపీ అభ్యర్థిపై 1,463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొన్ని రోజుల క్రితం జరిగిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం కావడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి.
మున్సిపాలిటీ తర్వాత ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో పులివెందుల టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. వరుస విజయాలతో టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.