హైదరాబాద్ (మెట్రో న్యూస్):
దేవాదుల, సీతారామ ఎత్తిపోతల
ద్వారా గోదావరి జలాల సద్వినియోగం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న మూడు బ్యారేజీలను సురక్షితంగా తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలపై గురువారం మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద నీళ్లున్నా వాటిని లిఫ్ట్ చేయడం లేదనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బ్యారేజీల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు
దిగువ గోదావరి నీరు వృథాగా పోకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిని లిఫ్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే మేడిగడ్డ కుంగిపోయిందని, బ్యారేజీల కుంగుబాటుకు దారితీసిన కారణాలను వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే కరువు పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఉండేవి కావని, ప్రాణహిత నీటిని తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి తీసుకువచ్చే అవకాశం ఉండేదని అన్నారు. . అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులకు దాదాపు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.