Take a fresh look at your lifestyle.

‘భూ భారతి’ మంత్రులకు వజ్రాల హరతి

0 9
  • ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడిస్తాం
  • ‘భూ భారతి’ మంత్రులకు వజ్రాల హరతి
  • రాహుల్ గాంధీకి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి లేఖ

హైదరాబాద్ (మెట్రో న్యూస్)

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత భూముల జాబితా (22ఏ)ను అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపిందని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న భూ బదిలీలు, చీకటి ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భారీ అవినీతి వ్యవహారంపై రాహుల్ గాంధీకి ఇంగ్లీష్, తెలుగు భాషలలో బహిరంగ లేఖను విడుదల చేసినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కేవలం చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరగడం కాకుండా, రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలపై రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

2014కు ముందు, ఆ తర్వాత ఉన్న 22ఏ భూముల జాబితాపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, అక్రమ ఆస్తుల బదిలీ, షెల్ కంపెనీల లావాదేవీలపై సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ (ఫోరెన్సిక్ ఆడిట్) జరిపించాలని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ పక్షాన ఆయన పట్టుబట్టారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వచ్చే నెల 5, 6 తేదీల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, భూములను నిషేధిత జాబితాలో చేర్చబడిన బాధితులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించి భూ భారతి 22ఏ సమస్యపై చర్యలు తీసుకోకపోతే బీజేపీ పక్షాన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.