– నీటి పొదుపు, చెట్ల పెంపకంతోనే వాతావరణ మార్పులకు అడ్డుకట్ట
వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్ 5:
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వేములవాడ పట్టణం సాయినగర్‌లోని స్కై స్కూల్ విద్యార్థులు గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఆవరణ నుంచి చెక్కపల్లి బస్టాండ్ మీదుగా కోరుట్ల బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా విద్యార్థులు ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ మార్పులు, వాటి దుష్పరిణామాలపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం, నీటి ఎద్దడి వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
నీటిని అవసరమైన మేరకే వినియోగించాలని, ఆహార పదార్థాలను వృథా చేయరాదని, ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించేందుకు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని విద్యార్థులు నినదించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని, ప్రకృతి వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత పాఠశాల కరెస్పాండెంట్ మహేష్ సందేశమిచ్చారు.
చిన్నారులు పర్యావరణ పరిరక్షణపై చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల అవగాహన ర్యాలీ పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ జమున, తులసిరామ్, శైలజ, దివ్య, హర్షిత, కావేరి, మమత, సౌందర్య, అంజలి, మయూరి, త్రివేణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.