సింగరేణి యాజమాన్యం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలి
ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ డిమాండ్
మెట్రో న్యూస్
సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడంలో జాప్యం చేయడంపై ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందాలన్నింటినీ వెంటనే అధికారిక ఉత్తర్వుల రూపంలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రామకృష్ణాపూర్ సీహెచ్‌పీలో ఫిట్ కార్యదర్శి హరి రామకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీహెచ్‌పీ ఎస్‌ఈ చంద్రమౌళికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ మాట్లాడుతూ.. డైరెక్టర్ల స్థాయిలో, నిర్మాణ కమిటీ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలను సర్క్యులర్ల రూపంలో వెంటనే విడుదల చేయాలన్నారు. కార్మికుల చిరకాల స్వప్నమైన సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను మినహాయింపులు, పేర్ల మార్పులు, కేడర్ స్కీమ్ తదితర అంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కార్మికుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయని, ఐదు బొగ్గు బ్లాకులకు కొబ్బరికాయ కొట్టే పరిస్థితి కూడా లేకపోవడానికి కారణాలేమిటో యాజమాన్యం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గుర్తింపు కార్మిక సంఘంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా బుధవారం సాయంత్రం జీఎం కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, సీహెచ్‌పీ కమిటీ సభ్యులు సీతారామారావు, అబ్బాస్, డొక్కు శ్రీను, శ్రీధర్, సిరాజ్, మండల శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, క్రాంతి, జంగం శ్రీనివాస్, ఆవుల మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.