- పరస్పరం ముట్టడి కార్యక్రమాలతో హోరాహోరీ…
- హైదరాబాద్, నల్గొండలో అరెస్టుల పర్వం
- అధినేత మౌనంతో వెనకబడిపోయిన బీఆర్ఎస్
(మెట్రో న్యూస్ బ్యూరో): జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు చేపట్టిన ముట్టడి కార్యక్రమాలతో హైదరాబాద్, నల్గండలో మధ్య హోరాహోరీ నెలకొంది. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ముట్టడితో రెండు పార్టీల మధ్య లొల్లి తీవ్రస్థాయిలో చెలరేగింది. బీజేపీ శ్రేణులు మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై కోడిగుడ్లు, టమాటాలతో ముట్టడించి.. మంత్రి ఫ్లెక్సీలను దగ్ధం చేశాయి. బదులుగా మంత్రి అనుచరులు జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపైకి దూసుకెళ్లి పాక్షికంగా ధ్వంసం చేశారు. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. మంగళవారం నల్గొండ వెళ్లేందుకు సిద్ధమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సహా పలువురు సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.


వాస్తవానికి తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఘర్షణ పరిస్థితులు లేవు. జాతీయ స్థాయి పరిణామాలతో ఉద్యమ కార్యాచరణ చేయడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు. ఇక్కడా అదే జరిగింది. వివరాల్లోకి వెళ్తే… దళితులపై జరుగుతున్న వివక్ష, అంటరానితనం, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా గళం వినిపించిన అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని రాష్ట్ర నేతలు తప్పుబడుతున్నారు. అలాగే ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. యూత్ కాంగ్రెస్ నేతలు ఆవేశంలో బీజేపీ కార్యాలయానికి నల్ల రంగులు పూయడం… బీజేపీ జెండాను, అమిత్ షా దిష్టిబొమ్మను తగులబెట్టడం… సహజంగానే బీజేపీ శ్రేణులను ప్రతిదాడులకు ఉసిగొల్పింది.
బీజేపీ కార్యాలయం ముట్టడి పేరుతో భౌతిక దాడులకు దిగడం పిరికిపంద చర్య అని బీజేపీ రాష్ట్ర నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కొద్దిరోజులుగా రేవంత్ సర్కారును నిలదీస్తూ… బీజేపీ పలు అంశాలపై ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేస్తోంది. దీంతో యువజన కాంగ్రెస్ కూడా ఓ కార్యాచరణ తీసుకుందని తెలుస్తోంది. అయితే అది భౌతిక దాడులకు, కార్యాలయంపై దాడులకు దారితీయడం ప్రజాస్వామ్యంలో హర్షణీయం కాదు. రెండు పార్టీలు సంయమనం పాటించాలి. రెండు జిల్లాలలో రెండు రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతుంటే… అటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను వీడి బయటకు రాకపోవడం… కేటీఆర్ విదేశాలకు వెళ్లడంతో… పార్టీకి మార్గదర్శకం కరవైందనే వాదన వినిపిస్తోంది.