Take a fresh look at your lifestyle.

తాగునీటి కొరత లేకుండా చూస్తాం

0 14

ములుగు (మెట్రో న్యూస్‌):

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగి, వర్షాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని రామప్ప చెరువు, అక్కడి డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రామప్ప చెరువులో ప్రస్తుతం 29 అడుగుల మేర నీరు అందుబాటులో ఉందని తెలిపారు. గోదావరి నుంచి నీటిని పంపింగ్ చేసి చెరువులు, పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా మెరుగుపరిచే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.

రామప్ప నుంచి నీటిని డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసి ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, మల్లంపల్లి పరిసర ప్రాంతాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని సీత‌క్క‌ వివరించారు. రామప్ప– లక్నవరం కాలువ వంటి ప్రతిపాదిత ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రత్యామ్నాయ నీటి వనరులను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తామని, నీటి సంరక్షణలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెరువుల పునరుద్ధరణతో పాటు బోర్ల రీచార్జ్ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా నీటి సంరక్షణ పనులు చేపట్టాలని, కూలీల సంఖ్యను పెంచి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచులు, గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు

Leave A Reply

Your email address will not be published.