Take a fresh look at your lifestyle.

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ!

0 2

హైదరాబాద్‌(మెట్రో న్యూస్) :

  • లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో సంక్షేమ ఫలాలు అందాలి
  • వ్యవసాయం, వైద్యం, ఉచిత విద్యుత్, గృహ వసతిపై ప్రత్యేక దృష్టి
  • ఉన్నతాధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను అత్యంత సమర్థవంతంగా వినియోగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సబ్‌ప్లాన్ ఉద్దేశం కేవలం నిధుల కేటాయింపు వరకే పరిమితం కాకూడదని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు సంపూర్ణంగా అందేలా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి వ్యవసాయం, ఇంధన, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌, పురపాలక తదితర కీలక శాఖల ఉన్నతాధికారులతో సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో జరిగిన వ్యయాన్ని విశ్లేషిస్తూ, నిధుల వినియోగంలో వేగం పెంచాలని సూచించారు. రైతు భరోసా, సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాలు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఎంత మేరకు లబ్ధి చేకూరుస్తున్నాయో క్షేత్రస్థాయిలో సమగ్ర గణాంకాలతో నివేదికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలను డిజిటల్‌ నమోదు ద్వారా పారదర్శకంగా పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్ల సమాచారం ప్రకారం అందుబాటులో ఉన్న సుమారు 1,300 ఎకరాల ఖాళీ భూమిని అర్హులైన నిర్రుపేద కుటుంబాలకు త్వరితగతిన కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. స్థలాలు లేని నిరుపేదలకు భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికల వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.
ఇదే సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో విద్యుత్ వైరింగ్, స్తంభాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు. ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లేందుకు మొబైల్ వైద్య యూనిట్లను విస్తరించాలని, అత్యవసర సమయాల్లో వైద్యులు, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ సుల్తానియా, సురేంద్రమోహన్, సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.