Take a fresh look at your lifestyle.

ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‎

0 19

హైద‌రాబాద్ (మెట్రో న్యూస్‌):

‎తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2026’ ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. “తెలంగాణ భవిష్యత్తును, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చే ఈ చారిత్రాత్మక ఘట్టంలో అధికారులంతా భాగస్వాములై స‌ద‌స్సును దిగ్విజయం చేయాలి” అని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు నిర్వహించనున్న ఈ గ్లోబల్ సదస్సు స‌న్నాహ‌క స‌మావేశం బుధ‌వారం ‎సచివాలయంలో జ‌రిగింది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజహ‌రుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

‎ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సదస్సు నిర్వహణ పర్యవేక్షణకు దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతి కమిటీకి ఒక సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. “ఈ రోజు నుంచే ప్రతిరోజూ సదస్సుకు సంబంధించిన ఏదో ఒక వార్త మారుమోగాలి. ప్రచారానికి ఆకాశమే హద్దుగా పనిచేసి, పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలి” అని అధికారులకు స్పష్టం చేశారు. ‎2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న బృహత్తర లక్ష్యంలో ఈ సమ్మిట్ కీలక మైలురాయి కానుందని పేర్కొన్నారు. ‎తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాలు, నగరాలు, రంగాలను గుర్తించి దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని  సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు, ఆర్థిక వికాసంలో అధికారులందరూ భాగస్వాములు కావాలని, ఎక్కడా రాజీ పడకుండా ఈ గ్లోబల్ సమ్మిట్‌ను చారిత్రాత్మక విజయం చేయాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.
‎

Leave A Reply

Your email address will not be published.