(మెట్రో న్యూస్)
- ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ముప్పు
- ప్రజలకు క్యాతనపల్లి పురపాలక సంఘం విజ్ఞప్తి
ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు తగ్గి, భవిష్యత్తులో తాగునీరు, విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని క్యాతనపల్లి పురపాలక సంఘం కమిషనర్ ఎన్ మురళీకృష్ణ కోరారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీరు, విద్యుత్తు వృథాను అరికట్టేందుకు పలు సూచనలు జారీ చేశారు.
ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం లేకుండా కుళాయిలను తెరిచి ఉంచరాదని సూచించారు. అవసరమైనంత నీటిని వినియోగించుకున్న వెంటనే కుళాయిలను మూసివేయాలని తెలిపారు. పైపులైన్లు, కుళాయిలు, నీటి తొట్టెల వద్ద నీరు కారుతుంటే వెంటనే పురపాలక కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు. నీటి సరఫరా కేంద్రాల వద్ద నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, బోరుబావుల నుంచి అవసరమైనంత నీటిని తోడుకున్న వెంటనే మోటార్లను నిలిపివేయాలని పేర్కొన్నారు. ప్రతి నీటిబొట్టును విలువైన వనరుగా భావించి పొదుపుగా వినియోగించాలని కోరారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం లేనప్పుడు దీపాలు, గాలిమరలు, చల్లదనాన్ని అందించే యంత్రాలు, ఇతర విద్యుత్తు పరికరాలను నిలిపివేయాలని సూచించారు. కార్యాలయ వేళలు ముగిసిన వెంటనే అన్ని పరికరాలు ఆపివేయాలని, పగటిపూట సహజ వెలుతురు ఉన్నప్పుడు అనవసరంగా దీపాలను వినియోగించరాదని తెలిపారు. విద్యుత్తు వృథా కనిపిస్తే సంబంధిత పురపాలక అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
సమాచారం కోసం సంప్రదించండి
జి. ఆశ్రిత్, సహాయ పురపాలక ఇంజినీరు: 8555848006
మాతంగి రవి, నీటి సరఫరా పర్యవేక్షకుడు: 9963538461
ఏ. వెంకటి, నీటి సరఫరా పర్యవేక్షకుడు: 9989167681
బంటు నారాయణ, విద్యుత్తు సిబ్బంది: 9391640311
డి. విజయ్, విద్యుత్తు సిబ్బంది: 9063322197
నీటిని పొదుపు చేయడం, విద్యుత్తును ఆదా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు సహజ వనరులను అందించేందుకు ప్రజలందరూ సహకరించాలని పురపాలక సంఘం కమిషనర్ విజ్ఞప్తి చేశారు.