Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించాలి

0 3

(మెట్రో న్యూస్)

స్పోర్ట్స్ అరీనాలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి

అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ జిల్లాలోని విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని, స్పోర్ట్స్ అరీనాలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ నిర్మల్ పట్టణ, గ్రామీణ మండలాల్లో విస్తృతంగా పర్యటించి వివిధ సంస్థలు, అభివృద్ధి పనులను పరిశీలించారు.
సోఫీనగర్‌లోని బాలికల సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల వసతిగృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు మెరుగైన భద్రతతోపాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెమిస్టర్ పరీక్షల సమయానికి సిలబస్ పూర్తిచేయడంతోపాటు, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అధ్యాపకులకు సూచించారు.
ఎంఈసీ విభాగం విద్యార్థులతో మాట్లాడి విద్య, భోజనం, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో బోర్డుపై లెక్కలు చేయించి, ప్రతిభ కనబరిచిన వారిని అభినందించి పెన్నులను బహుమతిగా అందజేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారి నుంచి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దివ్యనగర్‌లోని స్పోర్ట్స్ అరీనాను పరిశీలించిన కలెక్టర్, క్రీడాకారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని, క్రీడలు ఆడేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. షటిల్ బ్యాడ్మింటన్, పికిల్‌బాల్ కోర్టుల పరిసరాల్లో ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు.
మహాలక్ష్మీవాడ సమీపంలోని అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, జంతువుల స్టెరిలైజేషన్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఖానాపూర్, భైంసా ప్రాంతాల్లోనూ అనిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డంప్ యార్డును పరిశీలించిన కలెక్టర్, తడి, పొడి చెత్త వేర్పాటు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.
గండిరామన్న నుంచి కమలానగర్ వరకు చేపడుతున్న అటవీ, రెవెన్యూ భూముల రీ-సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, అటవీ, రెవెన్యూ శాఖల భూముల హద్దులను స్పష్టంగా గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియ భూముల సరిహద్దుల నిర్ధారణకు, భవిష్యత్తులో వివాదాల నివారణకు దోహదపడుతుందని తెలిపారు.
ఈ పర్యటనలో డివిఎహెచ్‌ఓ సురేష్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్లు రాజు, ప్రభాకర్, మున్సిపల్ డీఈ హరిభువన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.